Family tragedy: భర్తలేని జీవితాన్ని ఊహించుకోలేక ఇద్దరు పిల్లలను చంపి, ఆత్మహత్య
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:19 AM
భర్త మరణంతో తీవ్ర మనోవేదనతో గడుపుతున్న ఓ మహిళ ఇద్దరు పిల్లలను చంపేసి, తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది.
పిల్లలకు విషాహారం పెట్టి తాను తిన్న తల్లి
తల్లి, కుమార్తె మృతి.. కుమారుడు విషమం
తనను క్షమించాలంటూ సూసైడ్ నోట్
కల్వకుర్తి, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): భర్త మరణంతో తీవ్ర మనోవేదనతో గడుపుతున్న ఓ మహిళ ఇద్దరు పిల్లలను చంపేసి, తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. పురుగుల మందు కలిపిన అన్నాన్ని పిల్లలకు తినిపించి.. తాను తిన్నది. ఈ ఘటనలో తల్లి, కూతురు మృతి చెందగా కుమారుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో కొత్త సంవత్సరం రోజు జరిగిన ఈ ఘటన పలువురిని కలిచివేసింది. స్థానికుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా శ్రీరంగాపురానికి చెందిన భీంశెట్టి ప్రకాశ్‌కు కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన ప్రసన్న (38)తో పెళ్లయింది. ఈ దంపతులకు కూతురు మేఘన (13), కుమారుడు హర్షిత్ ఉన్నారు. ఈ కుటుంబం కల్వకుర్తిలోని తిలక్‌నగర్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. హైదరాబాద్ చౌరస్తాలో బుక్‌సెంటర్ నిర్వహిస్తున్న ప్రకాశ్ గత ఏడాది నవంబరు 14న గుండెపోటుతో మృతి చెందాడు. భర్త లేకపోవడంతో తాను ఇతరులపై ఆధారపడి బతకాల్సి వస్తుందని, అది తన వల్లకాదని.. తాను ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు కూడా అనాథలవుతారని భావించింది. కొత్త సంవత్సరం సందర్భంగా గురువారం మధ్యాహ్నం తన ఇంట్లో కూతురు, కుమారుడితో కలిసి కేక్ కట్ చేసింది. ఆ తర్వాత అన్నంలో పురుగుల మందు కలిపి పిల్లలకు తినిపించి తాను తిని, ఇంటి తలుపులు మూసేసింది. ఆమె తమ్ముడు చక్రధర్ సాయంత్రం ఇంటికొచ్చి తలుపులు తెరిచాడు. అప్పటికే మేఘన మృతి చెందగా ప్రసన్న, హర్షిత్ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే వారిని అతడు కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళుతుండగా ప్రసన్న మృతిచెందింది. హర్షిత్ పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను కల్వకుర్తిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్యలే భర్తలను చంపుతున్న ఈ రోజుల్లో భర్త మరణాన్ని తట్టుకోలేక, ఆయనలేని జీవితాన్ని ఊహించుకోలేక తీసుకున్న నిర్ణయానికి తనను క్షమించాలని ప్రసన్న తన తండ్రిని ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొంది.