Share News

Family Tragedy: ఎంతపని చేశావు తల్లీ

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:41 AM

కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వివాహిత బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. కళ్ల ముందే కుమార్తె, మనవడు చనిపోవడంతో....

Family Tragedy: ఎంతపని చేశావు తల్లీ

  • 11 నెలల చిన్నారికి విషమిచ్చి.. ఉరేసుకుని తల్లి ఆత్మహత్య

  • వారిద్దరి మరణాన్ని తట్టుకోలేక.. మృతురాలి తల్లి ఆత్మహత్యాయత్నం

సరూర్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ వివాహిత బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. కళ్ల ముందే కుమార్తె, మనవడు చనిపోవడంతో తట్టుకోలేక.. మృతురాలి తల్లి కూడా అదే ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని హస్తినాపురం జడ్పీ రోడ్డులో గల జయకృష్ణా ఎన్‌క్లేవ్‌ కాలనీలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా రామన్నపేట్‌ ప్రాంతానికి చెందిన యశ్వంత్‌రెడ్డి(33)కి అదే ప్రాంతానికి చెందిన సుష్మిత(27)తో నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. వారికి కుమారుడు అశ్వంత్‌ నందన్‌రెడ్డి(11నెలలు) ఉన్నాడు.

యశ్వంత్‌రెడ్డి చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. వచ్చే నెలలో వారి కుమారుడి పుట్టిన రోజు ఉండటంతో ఈ నెల 7న సుష్మిత తల్లి లలిత(50) హస్తినాపురం వచ్చింది. అదే రోజు బర్త్‌ డేకు సంబంధించిన షాపింగ్‌ చేశారు. కొంత కాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో చిన్నారి పుట్టిన రోజు కార్యక్రమం.. దానికయ్యే ఖర్చుల విషయమై గురువారం దంపతుల మధ్య మరోసారి తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్టు తెలిసింది. అనంతరం భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. తల్లి ముందే భర్త తనను తీవ్రంగా అవమానించడంతో సుష్మిత మనస్తాపానికి గురైంది. కాసేపటికి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి బాబుకు విషమిచ్చి.. ఆపై తాను ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అది చూసి తట్టుకోలేక పోయిన సుష్మిత తల్లి విషం తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

గురువారం రాత్రి 8 గంటల తర్వాత ఇంటికి వచ్చిన యశ్వంత్‌రెడ్డికి భార్య, కుమారుడు చనిపోయి.. అత్త అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు వచ్చి లలితను ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, తమ కుమార్తె, మనవడి మరణానికి యశ్వంత్‌రెడ్డే కారణమని ఆరోపిస్తూ సుష్మిత పెదనాన్న సంజీవరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకున్న పరపతితో అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజీని సైతం యశ్వంత్‌రెడ్డి తారుమారు చేశాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్తి కోసం తరచూ వేధించేవాడని, బర్త్‌ డే కోసం కొంత నగదు ఇవ్వగా, ఇంకా సొమ్ము కావాలని డిమాండ్‌ చేశాడని అంటున్నారు. ఆ వేధింపుల వల్లే ఈ దారుణం జరిగిందని చెబుతున్నారు. కాగా, యశ్వంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

Updated Date - Jan 10 , 2026 | 10:37 AM