నాకు ఫైలు ఇచ్చావ్‌గా.. పని అయిపోయినట్టే!
ABN , Publish Date - Jun 03 , 2026 | 06:11 AM
తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (టీజీఐఐసీ)లో ఓ అధికారి వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారింది.
టీజీఐఐసీలో భూముల కేటాయింపులో ఓ అధికారి పెత్తనం
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (టీజీఐఐసీ)లో ఓ అధికారి వ్యవహారం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమలు, ఇతరత్రా అవసరాల కోసం భూములు కేటాయించాలంటూ కార్పొరేషన్‌కు వస్తున్న దరఖాస్తులను తీసుకుంటూ.. ‘నాకు ఫైల్ ఇచ్చావ్‌గా.. నీ పని పూర్తయినట్టే. నేను చూసుకుంటా’’ అంటూ దరఖాస్తుదారుల్లో కొంతమందికి హామీ ఇస్తున్నట్టు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఏపీ సమయంలో ఏపీఐఐసీలో అనంతపురం జిల్లా పరిధిలో పనిచేసిన ఈ అధికారి ఒక ఎన్‌వోసీ జారీ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారని.. ఆ కేసు ఇప్పటికీ యాక్టివ్‌లోనే ఉందని సమాచారం. పైగా 2014లోనే ఆయన రిటైరయ్యారు కూడా. అలాంటి వ్యక్తిని మళ్లీ టీజీఐఐసీలోకి తీసుకోవడం, ఓ విభాగం సమన్వయ అధికారిగా బాధ్యతలు ఇవ్వడంపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల కార్పొరేషన్‌కు సంబంధించిన విషయాలు బయటికి వెళ్లడంలో సదరు అధికారి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.