Share News

పబ్‌లో ఎంజాయ్‌.. ఫౌమ్‌హౌస్‌లో పార్టీలు

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:33 AM

మెయినాబాద్‌ ఫౌమ్‌హౌస్‌ డ్రగ్స్‌, కాల్పుల కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 14న డ్రగ్స్‌ పార్టీ చేసుకొంటూ ఫామ్‌హౌస్‌లో...

పబ్‌లో ఎంజాయ్‌.. ఫౌమ్‌హౌస్‌లో పార్టీలు

  • మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసులో మరిన్ని కొత్త విషయాలు

  • విందుల్లో కాల్‌గర్ల్స్‌ కూడా ఉన్నట్లు అనుమానం

  • నిందితులకు ముగిసిన పోలీస్‌ కస్టడీ

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/శంషాబాద్‌): మెయినాబాద్‌ ఫౌమ్‌హౌస్‌ డ్రగ్స్‌, కాల్పుల కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 14న డ్రగ్స్‌ పార్టీ చేసుకొంటూ ఫామ్‌హౌస్‌లో పట్టుబడ్డ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పాటు మిగతా నిందితులంతా అంతకు ముందు రోజు కూడా అక్కడ పార్టీ చేసుకున్నట్లు తేలింది. గత నెల 13న హైదరాబాద్‌లోని ఒక పబ్‌లో ఎంజాయ్‌ చేసి తిరిగి ఫామ్‌హౌస్‌కు వచ్చి పార్టీ చేసుకున్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. ఆ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి వచ్చిన నమిత్‌ శర్మను రోహిత్‌రెడ్డి నగరంలోని ఓ హోటల్‌కు తీసుకు వెళ్లారు. అక్కడి నుంచి పబ్‌కు వెళ్లారు. పబ్‌లో ఇద్దరు రాజకీయ నేతలు వీరితో కలిసి విందు చేసుకున్నట్లు గుర్తించారు. అక్కడి నుంచి వారంతా మెయినాబాద్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. వారిలో ఒకరు తన వెంట ఇద్దరు అమ్మాయిలను తీసుకెళ్లినట్లు తెలిసింది. పార్టీ తర్వాత రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు ఫామ్‌హౌస్‌లోనే ఉండిపోగా.. మిగతా వారు వెళ్లిపోయి మరుసటి రోజు తిరిగి ఇక్కడికే పార్టీ కోసం వచ్చారు. ఈ ఫామ్‌హౌస్‌లో 2024 నుంచి 8 సార్లు పార్టీలు జరిగినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో మొత్తం 11 మంది పట్టుబడగా, విచారణలో మరో 15 మంది పేర్లు బయటకు వచ్చాయి. కాగా, ప్రధాన నిందితులైన రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మలను సిట్‌ అధికారులు శుక్రవారం కూడా విచారించారు. రోహిత్‌రెడ్డికి దుబాయ్‌, జాంబియా, బ్రిటన్‌లో వ్యాపారాలు ఉన్నట్లు గుర్తించారు. గత 5 నెలల్లో ఆయన పదిసార్లు దుబాయ్‌ వెళ్లినట్లు తేలింది. ఆయనకు డ్రగ్స్‌ మాఫియా ఇక్కడే పరిచయమైనట్లు సమాచారం. కాగా, రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌ శర్మలకు శుక్రవారం పోలీస్‌ కస్టడీ ముగిసింది. దీంతో మంగళవారం వారిని కోర్టులలో హాజరుపర్చనున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 05:33 AM