డ్రగ్స్ పార్టీలపై సిట్ నజర్
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:32 AM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. తన దర్యాప్తు పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించింది.
మొయినాబాద్ ఫామ్‌హౌ్‌సలో 24 సార్లు పార్టీలు జరిగినట్లు గుర్తింపు
ఆ పార్టీల్లో ఎవరెవరు పాల్గొన్నారన్న విషయంపై దర్యాప్తు వేగవంతం
ఇతర ఫామ్‌హౌ్‌సలలో జరిగిన డ్రగ్స్ పార్టీలపైనా సిట్ దృష్టి
తెరపైకి ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖుల పేర్లు!
ముగ్గురు ప్రధాన నిందితుల కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).. తన దర్యాప్తు పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్‌హౌస్‌లలో గతంలో నిర్వహించిన పార్టీలపై దృష్టిపెట్టింది. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో పట్టుబడిన నిందితులు గతంలో నగరంలో నిర్వహించిన డ్రగ్స్ పార్టీల్లో రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నట్లు అనుమానిస్తోంది. దీంతో డ్రగ్ పార్టీలు జరిగిన అన్ని చోట్లా సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించి విశ్లేషించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. మెయినాబాద్ ఫామ్‌హౌస్‌లోనే 24 సార్లు డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు నిందితుల విచారణలో తేలిందని సమాచారం. ఈ ఫామ్‌హౌస్‌తోపాటు చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాల్లోని రెండు నెలల ఫుటేజ్‌ని పోలీసులు సంపాదించారు. డ్రగ్స్ కేసు మరకలు మరికొంత మంది కీలక రాజకీయ నేతలకు అంటుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ దీన్ని అసెంబ్లీలో ప్రధాన అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉంది.
24 సార్లు డ్రగ్స్ పార్టీ
మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీకి డ్రగ్స్‌సరఫరా చేసిన అభిషేక్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇతని అరెస్ట్‌ను ఇంకా నిర్ధారించని పోలీసులు.. రహస్య స్థావరంలో విచారిస్తున్నట్లు తెలిసింది. రోహిత్‌రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి ఘటన జరిగిన సమయంలో డ్రగ్స్‌ను తానే సిమ్లా నుంచి తీసుకొచ్చినట్లు కట్టుకథలు చెప్పాడు. తరువాత జరిగిన విచారణలో రోహిత్‌రెడ్డి డ్రైవర్ సిల్వర్ శరత్ ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్‌లోనే అభిషేక్ సింగ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నుంచి కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. పార్టీ జరిగిన రోజు ఔటర్ రింగురోడ్డు సమీపంలో అభిషేక్ సింగ్‌ను కలిసి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు విచారణలో బయటపడింది. అభిషేక్ సింగ్‌తో శరత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అభిషేక్ సింగ్ 24 సార్లు రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ 24 పార్టీలపై పోలీసులు ఇప్పుడు దృష్టి పెట్టారు. ఇదే విషయంపై అభిషేక్‌తో పాటు సిల్వర్ శరత్, కౌశిక్ రవి, శ్రవణ్, అర్జున్‌రెడ్డిలను గత రెండు రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ పార్టీలన్నీ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నలుగురు ఏర్పాటు చేస్తారని తెలిసింది. గతంలో హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో వీరిలో కొందరు దొరికినప్పటికీ తరువాత కేసు నుంచి బయటపడినట్లు సమాచారం. ఇదిలా ఉండ గా డ్రగ్ పార్టీపై దాడిచేసిన సమయంలో ఈ కేసులో నిందితురాలైన ప్రియాంకరెడ్డి బ్యాగు నుంచి పోలీసులు రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
డ్రగ్స్ కేసులో మాఫియా కోణం
ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు డ్రగ్స్ మూలాలపై విచారణ చేస్తున్న సిట్‌కు ఊహించని సమాచారం లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ షార్ప్ షూటర్ అని తేలింది. ఇతనికి ఢిల్లీ, పంజాబ్ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని అంతర్జాతీయ మాఫియా ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకొనేందుకు ఢిల్లీ, పంజాబ్‌లకు పోలీసు బృందాలను పంపారు. ఇప్పటివరకు ఈ కేసు మొత్తం మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి చుట్టూనే తిరిగింది. పోలీసులు డ్రగ్స్ పార్టీపై దాడిచేసిన సమయంలో కాల్పులు జరిపిన నమిత్ శర్మ గురించి పోలీసులు ఎక్కడా పెద్దగా ప్రస్తావించలేదు. ఘటన జరిగిన సమయంలో అతను జైపూర్ ఎమ్మెల్యే అని చెప్పారు. ఆ తర్వాత ఎఫ్‌ఐఆర్‌లో అతను ఢిల్లీలోని క్లబ్ రోడ్డు, సివిల్ లైన్‌లో నివసించే బిజినెస్ మ్యాన్‌గా పేర్కొన్నారు. అయితే, విచారణలో కీలక అంశాలు బయటకు వచ్చాయి. గన్ లైసెన్స్ ఉన్న రోహిత్‌రెడ్డి సోదరుడి చేతిలోని రివాల్వర్ నమిత్‌శర్మ వద్దకు ఎలా వెళ్లింది? ఒకవేళ భయపడి లేదా పారిపోయేందుకు ప్రయత్నిస్తే రితీష్ రెడ్డి తన చేతిలో ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరిపేవాడు. కానీ, నమిత్ శర్మ క్షణాల్లో ఆ రివాల్వర్‌ను రితీష్ రెడ్డి నుంచి తీసుకుని పోలీసులపై కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది? అనే కోణంలో పోలీసులు విచారించారు. అతనికి గతంలో ఉన్న నేర చరిత్ర కారణంగా ప్రత్యర్ధులు ఎవరైనా దాడి చేశారని అతను భావించాడా? లేక రోహిత్‌రెడ్డి చెబితే కాల్పులు జరిపాడా? అనే కోణంలో కూడా విచారణ జరిపారు. ఈ సందర్భంగానే నమిత్‌శర్మ షార్ప్ షూటర్ అని గుర్తించారు. నేరచరిత్ర ఉండడం వల్లే అతడు క్షణాల్లో కాల్పులు జరిపాడని పోలీసులు చెబుతున్నారు. విచారణ సమయంలో కూడా అతడు ప్రముఖ వ్యక్తులతో తనకు సంబంధాలు ఉన్నాయని పోలీసులను బెదిరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు
ఈ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న రోహిత్‌రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఉప్పరిపల్లి కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈ పిటిషన్‌పై గత బుధవారం కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. అనంతరం కోర్టు సోమవారానికి తీర్పును రిజర్వు చేసింది. కస్టడీకి అనుమతి రాగానే విచారణ వేగవంతం చేసేందుకు సిట్ బృందం అన్ని ఏర్పాట్లు చేసింది.