నాటు కోళ్లు ఇచ్చేందుకు వచ్చి.. డ్రగ్స్ కేసులో ఇరికి!
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:23 AM
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. శుక్రవారం కూడా నిందితులను సిట్ బృందం శంషాబాద్‌లో విచారించింది.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన కోళ్ల వ్యాపారి
నిందితులను విచారించిన సిట్ వారి బ్యాంకు ఖాతాల లావాదేవీల పరిశీలన
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/శంషాబాద్ రూరల్): మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. శుక్రవారం కూడా నిందితులను సిట్ బృందం శంషాబాద్‌లో విచారించింది. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ పార్టీకి వచ్చే వారి కోసం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రత్యేకంగా నాటు కోడి కూర వండించగా.. ఆ నాటు కోళ్లను తీసుకొచ్చిన వ్యక్తి కూడా ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఫాంహౌస్ పక్కనే రోహిత్‌రెడ్డికి పరిచయమున్న ఎం.రమేశ్ అనే వ్యక్తి నాటు కోళ్లు పెంచుతున్నాడు. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తుంటాడు. కోళ్లు పెంచేందుకు సిబ్బందిని కూడా పెట్టుకున్నాడు. అయితే డ్రగ్స్ పార్టీ రోజు సాయంత్రం రోహిత్‌రెడ్డి మనుషులు ఇతనికి ఫోన్ చేసి ‘పెద్దసార్లు వస్తున్నారు. మంచి నాటు కోళ్లు కావాలి’ అని కబురు పెట్టారు. దీంతో అతడు అక్కడికి కోళ్లు ఇచ్చేందుకు వచ్చాడు. పార్టీ మొదలైన తర్వాత కూడా రమేశ్ అక్కడే ఉండటంతో.. రోహిత్‌రెడ్డి, ఎంపీ పుట్టా మహేశ్, అక్కడున్నవారితో పాటు అతడినీ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే సిట్ బృందం శుక్రవారం రమేశ్‌ను విచారించింది. తనకు ఈ వ్యవహారాలన్నీ ఏం తెలియవని.. పెద్దవాళ్లు వస్తున్నారు.. నాటు కోళ్లు కావాలని ఫోన్ చేస్తే అవి ఇచ్చేందుకు వెళ్లి ఇరుక్కుపోయానని వాపోయినట్లు తెలిసింది. అయితే అతడు చెప్తుంది నిజమా.. అబద్ధామా..? తేల్చే పనిలో సిట్ అధికారులు పడ్డారు. ఇక నిందితులకు దుబాయ్ లింక్‌లు కూడా ఉండడంతో ఆ మూలాలను ఛేదించేందుకు దుబాయ్‌తో పాటు ఢిల్లీకి కూడా ప్రత్యేక బృందాలను పంపాలని సిట్ ఇప్పటికే నిర్ణయించింది. ఇటు నిందితుల్లో ఒక్కరైన కౌశిక్ రవి ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్మిన అభిషేక్ సింగ్ కోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలు గాలిస్తున్నాయి. మరో నిందితుడు కౌశిక్ రవితో అభిషేక్ సింగ్‌కు మధ్య తరుచూ ఫోన్ కాల్స్ నడుస్తున్నట్లు సిట్ గుర్తించింది. అలాగే 11 మంది నిందితులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల లావాదేవీలపై దృష్టి సారించింది. ఇప్పటికే కొందరు బ్యాంకు లావాదేవీలు పరిశీలించినట్లు తెలిసింది. ఇక ప్రధాన నిందితులు రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఉప్పర్‌పల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది.