Share News

ఈత కొలనులో డ్రగ్స్‌!?

ABN , Publish Date - Mar 19 , 2026 | 04:34 AM

మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌సలో సోదాలకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరగడానికి ప్రత్యేక కారణం....

ఈత కొలనులో డ్రగ్స్‌!?

  • కాల్పుల కలకలం అందుకేనా?

  • ఆ సమయంలోనే స్విమ్మింగ్‌పూల్‌లో డ్రగ్స్‌ పడేసిన నిందితులు?

  • ఫాంహౌస్‌ కేసులో కొత్త కోణం

  • కస్టడీ పిటిషన్‌పై వాడీవేడి వాదనలు..

  • తెరపైకి అభిషేక్‌ సింగ్‌ పేరు

హైదరాబాద్‌/తాండూరు/రంగారెడ్డి/శంషాబాద్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మొయినాబాద్‌ డ్రగ్స్‌ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌సలో సోదాలకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరగడానికి ప్రత్యేక కారణం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పార్టీలో ఉన్న వారు కొద్ది సేపు పోలీసులు లోపలికి రాకుండా చూసేందుకే కాల్పులు ప్రారంభించారని, ఆ సమయంలో తమ వద్ద ఉన్న కొన్ని మత్తుమందులను అక్కడున్న ఈతకొలనులో పడేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు దాడి చేసిన సమయంలో 11 మందిని సోదా చేయగా బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్‌ రవి వద్ద స్వల్ప మొత్తంలో కొకైన్‌ లభించింది. టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌, నమిత్‌ శర్మల రక్తంలో కొకైన్‌ కాకుండా ఇతర మత్తు పదార్థాల అవశేషాలు లభించడంతో అసలు కథ వెలికి తీయడానికి పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. నమిత్‌ శర్మ రక్త నమూనాలో కొకైన్‌తో పాటు ఇతర అవశేషాలు, పుట్టా మహేశ్‌ రక్తంలో యాంఫిటమైన్‌, మెథాయాంఫిటమైన్‌ అవశేషాలు ఉన్నట్లు తేలింది. సంఘటన స్ధలంలో కొకైన్‌ మాత్రమే దొరికింది. ఇతర మత్తుమందులు ఏమయ్యాయనే కోణంలో అధికారులు విచారణ ప్రారంభించగా.. కాల్పులు జరిపిన సమయంలో తమ వద్ద ఉన్న ఇతర మత్తు పదార్థాలను ఈతకొలనులో పడేసినట్లు పార్టీకి వచ్చిన వారిలో ఒకరు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో నీటి నమూనాల ద్వారా ఏమైనా ఆధారాలు దొరుకుతాయా? అని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మత్తు పదార్ధాలను గుర్తించే స్నిఫర్‌ డాగ్స్‌ను సైతం ఫాంహౌ్‌సకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. యాంఫిటమైన్‌, మెథాయాంఫెటమైన్‌ (ఎండీ) డ్రగ్స్‌ అమ్ముతున్న పలువురిని గతంలో హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెలలో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 72 గ్రాముల ఎండీ స్వాధీనం చేసుకొని ముగ్గుర్ని అరెస్టు చేశారు. హైప్రొఫైల్‌ వ్యక్తులకు కొకైన్‌ దొరకని పక్షంలో ఎండీ మత్తుమందును వాడుతుంటారని పోలీసులు చెబుతున్నారు.


భయపడి కాల్పులు జరిపారు..!

రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేశ్‌ రెడ్డి, ఢిల్లీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అమిత్‌శర్మ కస్టడీకి సంబంధించి ఉప్పర్‌పల్లి కోర్టులో బుధవారం వాడీవేడి వాదనలు జరిగాయి. డ్రగ్స్‌ తీసుకొని వచ్చిన కౌశిక్‌ రవిని అరెస్టు చేయకుండా స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపారని, తమ క్లయింట్‌ రోహిత్‌రెడ్డి తదితరులను కుట్రపూరితంగా అరెస్టు చేశారని వారి తరఫు న్యాయవాది వాదించారు. తమ ఫాంహౌస్‌లోకి పోలీసులు మఫ్టీలో, గోడ దూకి వచ్చారని, ఆ క్రమంలో భయపడి కాల్పులు జరిపారని చెప్పారు. ఆర్థికపరంగా విచారించడానికి పోలీసులకు ఏమీ లేదని, దేశంలో ఎవరు ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చని తెలిపారు. పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో అన్ని విషయాలు నమోదు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. పోలీసులపై కాల్పులు ఎందుకు జరిగాయో తెలుసుకోవాలని, నిందితుల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాల గురించి లోతుగా విచారించాలని చెప్పారు. పార్టీకి తీసుకొచ్చిన డ్రగ్స్‌ ఎన్ని రకాలు? అవి ఎక్కడ కొన్నారనే విషయాలపై విచారించాల్సి ఉన్నందున పది రోజుల కస్టడీకి అనుమతించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి.. తీర్పును 20వ తేదీకి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా రోహిత్‌రెడ్డి పార్టీలో పెద్ద ఎత్తున మద్యం, మత్తుమందులు ఉన్నాయన్న సమాచారం రాత్రి 8 గంటలకు మొయినాబాద్‌ పోలీసులకు అందింది. దాదాపు గంట వ్యవధిలోనే పోలీసులు అన్ని అనుమతులు తీసుకొని 9.05 గంటల సమయంలో తనిఖీలు చేశారు.


ఆ కార్లలో వెళ్లిపోయిందెవరు?

పోలీసులు ఫాంహౌ్‌సకు రావడానికి కాస్త ముందుగా అక్కడి నుంచి కొన్నికార్లు వెళ్లిపోయాయని, వాటిలో వెళ్లిన వారెవరు? పార్టీకి రోహిత్‌రెడ్డి ఎవరెవరిని పిలిచారు? అన్న వివరాలను తెలుసుకోవడానికి ఈ కేసులో పట్టుబడిన వారందరి సెల్‌ఫోన్ల డేటాను సిట్‌ అధికారులు విశ్లేషిస్తున్నారు. రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దుబాయి కోణంతో సంబంధం ఉన్న కొందరు అక్కడ్నుంచి జారుకున్నారని అనుమానిస్తున్నారు.

కదులుతున్న డొంక..

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ కేసులో సిట్‌ వరుసుగా రెండో రోజు కూడా నిందితులను విచారించింది. కేసులో కీలకమైన శరత్‌, శ్రావణ్‌, కౌశిక్‌ను శంషాబాద్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సిట్‌ బృందం దాదాపు 8 గంటలపైనే విచారించింది. ఫ్యూచర్‌సిటీ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు పర్యవేక్షణలో సిట్‌ బృందం అన్ని కోణాల్లో విచారణను వేగవంతం చేసింది. కౌశిక్‌ రవి ఈ డ్రగ్స్‌ను సిమ్లాలో కొనుగోలు చేసినట్లు చెప్పినప్పటికీ విచారణలో అది వాస్తవం కాదని తేలింది. డ్రగ్స్‌ను హైదరాబాద్‌లోనే అభిషేక్‌ సింగ్‌ నుంచి కొనుగోలు చేసినట్లు నిందితులు చెప్పినట్లు సమాచారం. రోహిత్‌ డ్రైవర్‌ శరత్‌తో అభిషేక్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అభిషేక్‌ను అదుపులోకి తీసుకునే యత్నం చేస్తున్నారు. నిందితుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా డ్రగ్స్‌ మూలాలపైనా సిట్‌ గురి పెట్టింది. డ్రగ్స్‌ మాఫియా మూలాలను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఇప్పటికే రంగంలో దింపినట్లు తెలిసింది. ఫాంహౌస్‌ కేసు విచారణ సవ్యంగానే సాగుతోందని కమిషనర్‌ సుధీర్‌బాబు తెలిపారు. శంషాబాద్‌లో నిందితులను విచారించిన సుధీర్‌బాబు తదుపరి విచారణపై సిట్‌తో చర్చించారు. అనంతరం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. కేసు విచారణ వేగంగా జరుగుతోందన్నారు. కోర్టు అనుమతి రాగానే రిమాండ్‌లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకుంటామని తెలిపారు. కాగా, ముగ్గురు నిందితులను బుధవారం రాత్రి 9 గంటల తర్వాత కూడా విచారించారు.

ఏడు రోజుల్లో షోకాజ్‌పై సమాధానం ఇచ్చేనా?

రిమాండ్‌లో ఉన్న రోహిత్‌రెడ్డిని ఏడు రోజుల్లో షోకాజ్‌ నోటీసులకు సమాధానం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆదేశించడం చర్చనీయాంశమైంది. 14 రోజుల రిమాండ్‌లో ఉన్న వ్యక్తి షోకాజ్‌ నోటీస్‌కు లిఖితపూర్వకంగా, న్యాయపరంగా ఎలా జవాబు ఇస్తారన్న దానిపై స్పష్టత లేదు. రోహిత్‌ లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలంటే జైలర్‌ ద్వారానే షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలి, సమాధానం కూడా జైలర్‌ ద్వారానే రావాలి. రోహిత్‌ తరఫు న్యాయవాది ములాఖత్‌ సమయంలోనైనా సంజాయిషీ నోటీసుకు సమాధానం ఇవ్వాలి. ఇది చట్ట ప్రకారం సాధ్యం కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ మాత్రం నేరుగా సస్పెండ్‌ చేయకుండా బైలా్‌సను దృష్టిలో పెట్టుకొనే షోకాజ్‌ నోటీసు ఇచ్చిందని, సస్పెన్షన్‌ వేటు తప్పదని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు.

Updated Date - Mar 19 , 2026 | 04:34 AM