Share News

గ్యాస్‌ ధరలు ఇప్పట్లో పెరగవు

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:27 AM

ప్రపంచ వ్యాప్తంగా యుద్ధమేఘాలు కమ్ముకున్నా భారత్‌లో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరగలేదు.. ఇప్పట్లో పెరగబోవు.. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించే దృక్పథం ఉన్...

గ్యాస్‌ ధరలు ఇప్పట్లో పెరగవు

  • దూరదృష్టి గల మోదీ నాయకత్వమే ఇందుకు కారణం

  • పంచాంగ పఠనంలో సూర్యనారాయణమూర్తి

హైదరాబాద్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రపంచ వ్యాప్తంగా యుద్ధమేఘాలు కమ్ముకున్నా భారత్‌లో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరగలేదు.. ఇప్పట్లో పెరగబోవు.. భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే ఊహించే దృక్పథం ఉన్న, దూరదృష్టి కలిగిన మోదీ నాయకత్వమే ఇందుకు కారణం’’అని పంచాంగకర్త కె.సూర్యనారాయణ మూర్తి అన్నారు. కుజుడు మంత్రి కావడం వల్ల, ఏ దేశం కూడా మనవైపు రాకుండా రక్షణ మంత్రి కాపాడతారని వివరించారు. సనాతన ధర్మాన్ని గౌరవించే ఏకైక పార్టీ బీజేపీ అని, సానుకూల ఆలోచన ఎలా ఉండాలో పార్టీ సూచిస్తుందని పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ పార్టీపరంగా అయినా, వ్యవస్థాపరంగా అయినా ‘అప్‌డేట్‌ ’ కాకపోతే ‘ఔట్‌డేట్‌ ’ అవుతామని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కావాలని సూచించారు. పొరుగు వారి దగ్గర ఉన్నది మన దగ్గర లేదని బాధ పడకుండా, మనమెందుకు సాధించలేక పోయామో గుర్తించి అందుకనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. ఈ ఏడాది మహిళలకు అధికారాలు పెరుగుతాయని చెప్పారు. బంగారం ధరలు ఆకాశంలో నాట్యం చేస్తాయని, కొనుగోలు చేయకపోవడమే మేలని అభిప్రాయపడ్డారు. విద్యావిధానంలో మార్పులు చోటుచేసుకోబోతాయని పేర్కొంటూ.. జాతీయ నూతన విద్యావిధానం ఈ సంవత్సరం నుంచే కేంద్రం అమలు చేయబోతుందన్నారు. యమునా నది పుష్కరాలు జూన్‌ 2నుంచి 13వ తేదీ వరకు ఉంటాయన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు సాగాలని పార్టీ శిక్షణ కార్యక్రమాల్లో తాము కూడా చెబుతున్నామన్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ‘పరాభవం’.. మన దేశానికి కాదు.. అది శత్రువులు, దేశద్రోహులకు మాత్రమేనన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 05:27 AM