Share News

మోదీ 12 ఏళ్ల పాలన..దేశ ప్రగతికి అసలైన నిదర్శనం

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:38 AM

మోదీ 12 ఏళ్ల పాలన దేశ ప్రగతికి అసలైన నిదర్శనమని, వికసిత భారత్‌కు స్వర్ణయుగమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు అన్నారు.

మోదీ 12 ఏళ్ల పాలన..దేశ ప్రగతికి అసలైన నిదర్శనం

  • దేశ ప్రధానిగా 4,399 రోజులు పూర్తి

  • ఏకైక భారతీయ నాయకుడిగా చరిత్ర

  • వచ్చే ఎన్నికల తర్వాత మళ్లీ మోదీనే ప్రధాని

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ రావు

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): మోదీ 12 ఏళ్ల పాలన దేశ ప్రగతికి అసలైన నిదర్శనమని, వికసిత భారత్‌కు స్వర్ణయుగమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు అన్నారు. మోదీ దేశ ప్రధానిగా విజయవంతంగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారని, అత్యధిక కాలం ప్రధాని బాధ్యతలు నిర్వహించిన ఏకైక భారతీయ నాయకుడిగా సరికొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు. బుధవారం నగరంలోని ది హోటల్‌ ప్లాజాలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘‘జన విశ్వాస్‌, వికాస్‌, జన్‌ కల్యాణ్‌’’ (ప్రజల విశ్వాసం, అభివృద్థి, ప్రజా సంక్షేమం) అనే మూడు మహోన్నత లక్ష్యాలతోనే విజయవంతంగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల కాలం మిగిలి ఉందని, వచ్చే తర్వాత కూడా మోదీనే మళ్లీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా కాలం పాటు దేశాన్ని కాంగ్రెస్‌ పాలించినప్పటికీ, బ్రిటిష్‌ వాళ్లు రూపొందించిన చట్టాలు, విద్యా విధానం, పరిపాలనా వ్యవస్థ అలాగే కొనసాగాయని విమర్శించారు. యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలను, అవినీతి చోటు చేసుకుందని పేర్కొన్నారు. కానీ 12 ఏళ్లలో మోదీ చేసిన అత్యంత ముఖ్యమైన పని దేశాన్ని కాలనీయ (వలసవాద) భావజాలం నుంచి బయటకు తీసుకురావడమేనని స్పష్టం చేశారు. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏకంగా 71 శాతానికి పెరగడం రికార్డు అని, దాంతో రైతుల ఆదాయం పెరిగిందన్నారు.

తెలంగాణపై వివక్ష చూపలేదు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపకుండా తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, లక్షల కోట్ల రూపాయల విలువైన నిధులు, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు అందించిందని రాంచందర్‌ రావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రగతికి లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు, పెట్టుబడులు, సంక్షేమ పథకాలు అందించినట్లు పేర్కొన్నారు. ‘మోదీ అంటే అభివృద్ధి - అభివృద్ధి అంటే మోదీ’ అని తాము బలంగా నమ్ముతున్నామని ఆయన చెప్పారు.

Updated Date - Jun 11 , 2026 | 04:38 AM