మోదీ పాలనా వైఫల్యాలపై రోడ్డెక్కుతున్న యువత
ABN , Publish Date - Aug 29 , 2026 | 03:38 AM
ప్రధాని నరేంద్ర మోదీ పాలనా వైఫల్యాలపై దేశవ్యాప్తంగా యువత తీవ్ర ఆగ్రహంతో రోడ్లపైకి వస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, నాణ్యమైన విద్యను..
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం: చామల
కులగణన ప్రశ్నావళిని కేంద్రం సవరించాలి: వీహెచ్
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ పాలనా వైఫల్యాలపై దేశవ్యాప్తంగా యువత తీవ్ర ఆగ్రహంతో రోడ్లపైకి వస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, నాణ్యమైన విద్యను అందించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఫలితంగా దేశంలో దాదాపు 8.7 కోట్ల మంది యువత ఉద్యోగాలు లేక అల్లాడుతోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ, ఎన్డీయే ప్రభుత్వ ఓటమి ఖాయమన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం, చందాల వసూళ్ల పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, దీనిపై ట్రస్ట్ సభ్యులు, ఇతర పెద్దల పాత్రపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల్లోనే 33 శాతం మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని ఖర్గే ఇప్పటికే లేఖ రాశారని గుర్తు చేశారు. కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు సంయుక్తంగా ప్రధానికి లేఖ రాశారని ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు చెప్పారు. ప్రస్తుతమున్న కులగణన ప్రశ్నావళి తప్పుదోవ పట్టించేలా ఉందని, పరిమితులు లేని ప్రశ్నల విధానం వల్ల సరైన సమాచారం రాకపోగా డేటా దుర్వినియోగం అయ్యే ప్రమాదముందన్నారు.