TPCC state president Mahesh Kumar Goud: గాంధీల పేరు వింటేనే మోదీకి భయం
ABN , Publish Date - Jan 04 , 2026 | 05:10 AM
సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లు వింటేనే ప్రధాని మోదీ భయపడుతున్నారని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్ విమర్శించారు...
‘ఉపాధి హామీ’కి గాంధీ పేరు తొలగించడం దుర్మార్గం
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
ఇందిరాపార్కు వద్ద ఫీల్డ్ అసిస్టెంట్ల మహా ధర్నా
కవాడిగూడ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లు వింటేనే ప్రధాని మోదీ భయపడుతున్నారని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి, రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవుతారని అన్నారు. జాతీయ ఉపాఽధి హామీ పథకానికి ఉన్న గాంఽధీ పేరును తొలగించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకొని బీజేపీ అఽధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమీలేదన్నారు. ఎన్నో వేల సంవత్సరాల క్రితం జన్మించిన రాముడికి బీజేపీకి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం తెలంగాణ ఫీల్డ్ అసిస్ట్టెంట్స్ అండ్ అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు హాజరైన మహేశ్ గౌడ్, ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి సంజీవరెడ్డి, కనీస వేతనాల బోర్డు సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. గత యూపీఏ ప్రభుత్వం పేదలకు ఆసరాగా ఉండేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుట్టిందని, అయితే నేడు బీజేపీ ప్రభుత్వం ఈ పథకానికి గాంధీ పేరును మార్చడంతో పాటు పథకానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని విమర్శించారు.