Share News

అధికార పీఠమే లక్ష్యంగా..

ABN , Publish Date - May 07 , 2026 | 04:49 AM

పశ్చిమ బెంగాల్‌లో ఘనవిజయంతో ఊపుమీదున్న బీజేపీ.. తమ తదుపరి టార్గెట్‌గా తెలంగాణను ఎంచుకుంది. దక్షిణాదికి గేట్‌వేగా భావిస్తూ అధికార పీఠం కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.

అధికార పీఠమే లక్ష్యంగా..

  • తెలంగాణలో బీజేపీ వ్యూహాత్మక అడుగులు

  • విడతల వారీగా మోదీ, అమిత్‌షా టూర్లు

  • హైటెక్స్‌లో అధికారిక కార్యక్రమాలను..

  • వర్చువల్‌ ద్వారా ప్రారంభించనున్న మోదీ

  • అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని పర్యటన: రాంచందర్‌రావు

  • రేపటి నుంచి సికింద్రాబాద్‌లో బండి సంజయ్‌ మకాం

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్‌లో ఘనవిజయంతో ఊపుమీదున్న బీజేపీ.. తమ తదుపరి టార్గెట్‌గా తెలంగాణను ఎంచుకుంది. దక్షిణాదికి గేట్‌వేగా భావిస్తూ అధికార పీఠం కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అభివృద్ధి నినాదంతో పార్టీ అగ్రనాయకత్వం విస్తృత కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ఈ నెల 10న ప్రారంభించబోతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రక్రియ.. పార్టీ అంతర్గత కార్యాచరణ అమలుకు తొలిమెట్టు అవుతుందని రాష్ట్ర బీజేపీ శ్రేణులు అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ముందుగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడం కీలకమని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఇందుకనుగుణంగా ప్రధాని బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తమ ఎత్తుగడలకు కొరుకుడు పడని బెంగాల్‌లోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పట్టు సాఽధించిన తెలంగాణలో కూడా కాషాయ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో అగ్రనాయకత్వం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విడతల వారీగా రాష్ట్రంలో పర్యటించబోతున్నారని తెలిపాయి. ఇద్దరు అగ్రనేతలే కాకుండా.. మరికొందరు కీలక నేతలు కూడా తెలంగాణలో మకాం వేయబోతున్నారని, వచ్చే ఎన్నికల వ్యూహరచనను ఇప్పటినుంచే అమలు చేయబోతున్నారని ఆ వర్గాలు ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పాయి. బెంగాల్‌ ఎన్నికల్లో సాధించిన అపూర్వ విజయం తర్వాత ప్రధాని మోదీ హాజరవుతున్న తొలి బహిరంగ సభ కావడంతో 10న జరిగే ఆయన పర్యటనను బీజేపీ రాష్ట్ర నాయకత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కనీవినీ ఎరుగని రీతిలో స్వాగత ఏర్పాట్లు చేస్తోంది. ‘పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగసభను ఒక విజయోత్సవ సభగా భావిస్తున్నాం. ఇదే సమయంలో తెలంగాణలో సమరానికి సన్నాహక సభగా పరిగణిస్తున్నాం’ అని పార్టీ ముఖ్యనేత ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు, ‘అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని పర్యటన కొనసాగబోతోంది. ఇది ఆరంభం మాత్రమే. త్వరలో మరికొన్ని కీలక అభివృద్ధి ప్రాజెక్టులనూ ప్రధాని ప్రారంభిస్తారు. దశలవారీగా ఆయన పర్యటనలు ఉంటాయి’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అన్నారు.


ప్రధాని పర్యటన షెడ్యూల్‌ ఇదీ..

ప్రధాని మోదీ ఈ నెల 10న రాష్ట్ర పర్యటన సందర్భంగా రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారని రాంచందర్‌రావు తెలిపారు. ప్రధాని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హైటెక్స్‌కు చేరుకుంటారు. పలు జాతీయ రహదారులు, వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్కు, జహీరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఇండస్ట్రియల్‌ జోన్‌, మల్కాపూర్‌లో మెట్రో టెర్మినల్‌ను, ఆధునికీకరించిన జోగులాంబ గద్వాల, హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌లను, వీటితో పాటు మరికొన్ని రైల్వే ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రూ.3 వేల కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న జాతీయ రహదారుల విస్తరణ పనులకు ప్రధాని వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. అనంతరం, మాదాపూర్‌లో ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పరేడ్‌ గ్రౌండ్స్‌ చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారు.

కరీంనగర్‌ నుంచి 1000 కార్లు, 250 బస్సులు

ప్రధాని బహిరంగ సభకు కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1000 కార్లు, 250 బస్సులు ఏర్పాటు చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జిగా నియమితుడైన ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి.. స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహించారు. స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్‌, నాలుగు రోజులపాటు కరీంనగర్‌ నియోజకవర్గంలో మోదీ సభ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. కాగా, పార్టీ నాయకత్వం సంజయ్‌కి సికింద్రాబాద్‌ పరిధిలోని మహంకాళి జిల్లా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. దీంతో గురువారం నుంచి నాలుగు రోజులపాటు సంజయ్‌ అక్కడే మకాం వేయనున్నారు. నగరం నుంచి భారీ జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. గురువారం పార్టీ సిటీ కార్యాలయంలో ముషీరాబాద్‌ నియోజకవర్గ నాయకులతో భేటీ కానున్నారు. ఎంపీ కె.లక్ష్మణ్‌ కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. శుక్రవారం బైక్‌ర్యాలీ, పాదయాత్ర నిర్వహించి ఇంటింటికీ వెళ్లి మోదీ సభకు స్థానికులను సంజయ్‌ ఆహ్వానిస్తారని పార్టీ వర్గాలు వివరించాయి.

నాడు మల్కాజిగిరి నుంచే మోదీ ప్రచారం

2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దక్షిణ భారతదేశంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోదీ మల్కాజిగిరి నుంచే ప్రారంభించారని ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. ‘ఆ సభ తర్వాత ఉత్తరాఖండ్‌, ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్రల్లో మోదీ ప్రచారం చేశారు. ఆ సభల్లో ఆయన, హైదరాబాద్‌ ప్రజల చైతన్యంపై మాట్లాడారు. తెలంగాణలో భారీ మార్పు రాబోతోందని ఆనాడే చెప్పారు. దీనికి తగ్గట్టుగా 8 ఎంపీ స్థానాల్లో పార్టీ విజయం సాధించింది’ అని అన్నారు.

Updated Date - May 07 , 2026 | 04:49 AM