కొత్త సంస్కృతి.. కో-లివింగ్
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:46 AM
హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న కో-లివింగ్ సంస్కృతి, దానితో ఎదురవుతున్న సమస్యలకు ఇవి ఉదాహరణలు మాత్రమే. వర్కింగ్ హాస్టళ్లతో పోలిస్తే..
హైదరాబాద్‌లో పెరిగిపోతున్న కో-లివింగ్.. ఒకే ఫ్లాట్‌లో, గదిలో కలిసి ఉంటున్న యువతీ యువకులు
కనిష్క్ ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగి. ఓ డేటింగ్ యాప్‌లో పరిచయమైన తన్వితో కలిసి కో-లివింగ్ హాస్టల్‌లో ఉంటున్నాడు. రెండేళ్లు కలిసున్న తర్వాత కనిష్క్ తనను మోసం చేశాడంటూ.. తన్వి పోలీసులను ఆశ్రయించింది.
..హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న కో-లివింగ్ సంస్కృతి, దానితో ఎదురవుతున్న సమస్యలకు ఇవి ఉదాహరణలు మాత్రమే. వర్కింగ్ హాస్టళ్లతో పోలిస్తే.. స్వేచ్ఛా వాతావరణం, యువతీ యువకులు కలిసి ఉండటానికి అవకాశం ఉండటం, ఇంట్లో ఉన్నట్టుగా సదుపాయాలు, కొంతవరకు ప్రైవసీ ఉంటోం ది. దీనితో ఐటీ, ఇతర కీలక రంగాల్లోని ఉద్యోగులు, కోచింగ్ కోసం వచ్చినవారు, విద్యార్థులు కూడా కో-లివింగ్ హాస్టళ్లలో ఉంటున్నారు. కానీ ఇది కో-లివింగ్ ను దాటేసి పెళ్లికాకుండానే అన్నిరకాలుగా కలిసి ఉండే ‘సహజీవన సంబంధాల (లివిన్ రిలేషన్‌షి్‌ప) ’ సంస్కృతిగా మారుతోంది. ఇది ఆధునిక భావాలు, మారుతున్న పరిస్థితులకు నిదర్శనమని యువత చెబుతుంటే.. మన సంస్కృతి, సాంప్రదాయాలకు విఘాతమని తల్లిదండ్రులు, సాంప్రదాయవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఇలా కలిసున్నవారి మధ్య విభేదాలు వచ్చినా, మోసానికి గురైనా పోలీసు కేసులు పెట్టుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఇది సామాజిక సమస్యగా మారుతోందన్న ఆందోళనలూ ఉన్నాయి.
కోవిడ్ అనంతర పరిస్థితుల్లో..
హైదరాబాద్‌లో వర్కింగ్ హాస్టళ్లతోపాటు కో-లివింగ్ హాస్టళ్లు చాలా కాలం నుంచీ ఉన్నా.. కొవిడ్ అనంతరం, ముఖ్యంగా హైబ్రిడ్ పని వాతావరణం నేపథ్యంలో వాటికి డిమాండ్ పెరిగింది. ఇటీవలి కాలంలో కార్పొరేట్ సంస్థలు ఈ విభాగంలోకి రావడం, మంచి సౌకర్యాలతో అందుబాటు ధరల్లో వసతి అందిస్తుండటంతో.. ఉద్యోగులు, విద్యార్థులు, కోచింగ్ తీసుకునేందుకు వచ్చేవారు వీటిపై మక్కువ చూపుతున్నారు. కో-లివింగ్‌లో ఒకే గదిలో కలిసి ఉండటంతోపాటు డబుల్, త్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్ల తరహాలోనూ ఉంటాయి. ఒక్కో రూమ్ ఒకరికి ప్రత్యేకంగా ఉంటుంది. లివింగ్ రూమ్, కిచెన్, డైనింగ్, గేమింగ్ ఏరియా, జిమ్ వంటివి మాత్రం ఉమ్మడిగా వాడుకుంటారు. దీనితో పరిచయాలు, స్నేహాలు పెరుగుతాయని, కలిసి ఉండటం, కొత్తవారితో ఎలా వ్యవహరించాలో అనేది తెలుస్తుందని.. ఒత్తిడి లేని, ఒంటరితనానికి దూరంగా ఉండే జీవితాన్ని కోరుకునేవారికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయని అభిప్రాయాలున్నాయి. కో-లివింగ్ హాస్టళ్ల నిర్వాహకులు, కంపెనీలు.. సదుపాయాలను బట్టి నెలకు ఒక్కొక్కరికి రూ.12 వేల నుంచి 25 వేల వరకు వసూలు చేస్తున్నాయి. అంతమొత్తం చెల్లించి ఉండటానికి కూడా చాలా మంది ముందుకొస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారేగాకుండా.. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాలవారు కూడా కో-లివింగ్‌లో ఉండటం పెరిగిందని హాస్టళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. కో-లివింగ్ హాస్టళ్లలో 60-70శాతం బయటి రాష్ట్రాల వారుంటే.. 30-40శాతం తెలుగు రాష్ట్రాల వారు ఉంటున్నారని ఒక ప్రముఖ కో-లివింగ్ బ్రాండ్ మేనేజర్ తెలిపారు.
నగరంలో 70 వేల మందికిపైగా..
హైదరాబాద్‌లో కో-లివింగ్ మార్కెట్ భారీగా పెరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో వ్యవస్థీకృత కో లివింగ్ మార్కెట్ సుమారు రూ. 4వేల కోట్లు అయితే.. అందులో హైదరాబాద్ వాటానే రూ.750 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా ఐటీ కారిడార్, కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో కో-లివింగ్ హాస్టళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం నగరంలో 400కుపైగా కో-లివింగ్ హాస్టళ్లలో 70వేల మందికిపైగా ఉంటున్నారు. పలు నగరాల్లో కో-లివింగ్ స్పేస్‌లను నిర్వహిస్తున్న ఒక సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల్లో, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుకునేవారిలో చాలామంది ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చినవారేనని చెప్పారు. చాలా కంపెనీలు హైబ్రిడ్ వర్క్ విధానాన్ని అనుసరిస్తున్నాయని.. దీనితో చాలామంది కో-లివింగ్ వైపు చూస్తున్నారని తెలిపారు. ముగ్గురు, నలుగురు కలిసి అపార్ట్‌మెంట్ తీసుకుని ఉండే బదులు.. పూర్తి సెక్యూరిటీ, సౌకర్యాలు, శుభ్రత, నెట్‌వర్కింగ్ పెంచుకునే అవకాశాలు వంటివాటితో కో-లివింగ్‌కు ముందుకొస్తున్నారన్నారు. ఇక్కడి ఒక బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేస్తున్న బెంగళూరుకు చెందిన రజనీష్ మాట్లాడు తూ.. ‘కో-లివింగ్ స్పేస్‌లో సౌకర్యం, భద్రత ఎక్కు వ. సీసీటీవీ నిఘా, ప్రొఫెషనల్ క్లీనింగ్ సేవలుం టాయి. ముఖ్యంగా పంచుకోవడంలోని ఆనందం ఇ క్కడ మరింత స్పష్టంగా కనిపిస్తుంది’ అని అన్నారు.
ఉత్తరాది రాష్ట్రానికి చెందిన రాధిక, దక్షిణాదికి చెందిన కృష్ణ.. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు.. ఇద్దరూ స్నేహితులు.. గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్ సంస్థ కో-లివింగ్ హాస్టల్‌లో రూమ్ తీసుకుని కలిసి ఉంటున్నారు. రాధిక ఆమె తల్లిదండ్రులు అడిగితే స్నేహితులతో కలిసి ఉంటున్నట్టు చెబుతుంది. కృష్ణ కూడా అలాగే తన తల్లిదండ్రులకు చెబుతుంటాడు. అకస్మాత్తుగా వచ్చే వరకు కూడా వారి తల్లిదండ్రులకు ఈ సంగతి తెలియదు. అన్ని హద్దులూ దాటేసిన ఈ ఇద్దరూ పెళ్లి చేసుకొమ్మంటే మాత్రం వద్దంటున్నారు..
స్వేచ్ఛ పేరిట విచ్చలవిడితనం
కో-లివింగ్‌లో కలిసి ఉంటే పెద్దగా సమస్య లేదుగానీ.. అది ఎక్కువ సందర్భాల్లో సహజీవనంగానే ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లయినా ఉద్యోగం, చదువు, కోచింగ్ కోసం కుటుంబాన్ని వదిలి ఒంటరిగా ఉంటున్నవారూ కో-లివింగ్‌లో ఉంటుండటం సమస్యగా మారుతోందంటున్నారు. నిజానికి అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లికాకుండా ఒకేచోట ఉండటాన్ని అంగీకరించలేని సమాజం మనది. కానీ కో-లివింగ్ హాస్టళ్లలో ఉంటున్న యువత మాత్రం ఇష్టపూర్వకంగా కలిసుంటే తప్పేముందంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుందని.. మనసులు కలిసినప్పుడు తనువులూ కలుస్తాయని పేర్కొంటున్నారు. భేదాభిప్రా యాలొచ్చినప్పుడు పెళ్లయినవారు విడాకులు తీసుకున్నట్టే, ఇక్కడ బ్రేకప్ చెప్పుకుని వెళ్లిపోతామని గుర్గావ్ నుంచి వచ్చి ఇక్కడ ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న చౌదరి చెప్పారు. అయితే ఈ కోలివింగ్ ఫ్లాట్లు డ్రగ్స్, ఆల్కాహాల్ వినియోగం వంటి విచ్చలవిడితనానికి, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటం వంటివాటికి అడ్డాలుగా మారుతున్నాయనే విమర్శలూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఐటీ కారిడార్‌లో నమోదవుతున్న కేసుల్లో లివిన్ రిలేషన్‌లో ఉండి.. అభిప్రాయ భేదాలు, ఇగోతో కేసులు పెట్టుకున్నవారి సంఖ్య పెరుగుతోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.