Share News

ఆధునిక సాగుతోనే రైతుల అభివృద్ధి

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:10 AM

ఆధునిక వ్యవసాయ పద్ధతులతోనే రైతులు అధిక ఆదాయం, అభివృద్ధి సాధిస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఆధునిక సాగుతోనే రైతుల అభివృద్ధి

  • శాస్త్రవేత్తలు గ్రామస్థాయికి వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలి:తుమ్మల

  • ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ ప్రారంభం

ఖమ్మం, ఏప్రిల్‌ 27 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి): ఆధునిక వ్యవసాయ పద్ధతులతోనే రైతులు అధిక ఆదాయం, అభివృద్ధి సాధిస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామస్థాయికి వెళ్లి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించేలా రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. ఈ విషయంలో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమించాలని, రైతులు ఏ భూమిలో ఏ పంట వేయాలి? ఎంత ఎరువు వేయాలి? తదితర అంశాలను వివరించాలని చెప్పారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల రైతు వేదిక నుంచి ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని తుమ్మల ప్రారంభించారు. వచ్చే సీజన్‌లో ఖమ్మం జిల్లాలో గోద్రేజ్‌ ఆయిల్‌పాం ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందని, ఇక్కడే ఆయిల్‌పామ్‌ నర్సరీ స్థాపించేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి నిధులు కేటాయించలేదని, కానీ తమ ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విద్యాలయం నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు రైతులకు అధునాతన సాగు విధానాలపై అవగాహన కల్పించారు.

Updated Date - Apr 28 , 2026 | 07:11 AM