Share News

ఫాంహౌస్‌ కేసులో డ్రగ్స్‌ సప్లయర్‌.. అభిషేక్‌ అరెస్ట్‌!

ABN , Publish Date - Mar 22 , 2026 | 05:11 AM

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులకు డ్రగ్స్‌ సరఫరా చేసిన సప్లయర్‌ అభిషేక్‌ సింగ్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.

ఫాంహౌస్‌ కేసులో డ్రగ్స్‌ సప్లయర్‌.. అభిషేక్‌ అరెస్ట్‌!

  • శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో అదుపులోకి.. రహస్యంగా విచారణ!

  • రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌కు 24 సార్లు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు ప్రాథమికంగా వెల్లడి

  • డ్రైవర్‌ శరత్‌, అభిషేక్‌ మధ్య సాన్నిహిత్యం.. డ్రగ్స్‌ మూలాలపై లోతుగా సిట్‌ దర్యాప్తు

  • ఈ కేసులో మిగతా ఆరుగురు నిందితులనూ శనివారం రాత్రిదాకా విచారించిన సిట్‌

  • రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ సీజ్‌కు రంగం సిద్ధం చేసిన రెవెన్యూ అధికారులు

  • అసైన్డ్‌ భూమి కొని ఫాంహౌస్‌ నిర్మాణం.. రికార్డుల్లో ఇప్పటికీ అసైనీ జంగయ్య పేరే

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/శంషాబాద్‌ రూరల్‌/మొయినాబాద్‌)

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ పార్టీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులకు డ్రగ్స్‌ సరఫరా చేసిన సప్లయర్‌ అభిషేక్‌ సింగ్‌ను పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున అతణ్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే అతని అరెస్టును పోలీసులు అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. రహస్య ప్రాంతంలో అతణ్ని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్నేహితుడు కౌశిక్‌ రవి.. డ్రగ్స్‌ను తానే సిమ్లా నుంచి కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకొచ్చినట్లు ఇంతకుముందు చెప్పాడు. అయితే తరువాత జరిగిన విచారణలో ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్‌లోనే అభిషేక్‌ సింగ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నుంచి కొనుగోలు చేసినట్లు బయటపడింది. డ్రగ్స్‌ పార్టీ జరిగిన రోజు రోహిత్‌రెడ్డి డ్రైవర్‌ సిల్వేరి శరత్‌ ఔటర్‌ రింగురోడ్డు సమీపంలో అభిషేక్‌ సింగ్‌ను కలిసి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో అభిషేక్‌ సింగ్‌కు రోహిత్‌రెడ్డి డ్రైవర్‌ శరత్‌కు సన్నిహిత సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ తరుచూ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు కాల్‌ డేటా ద్వారా తేల్చారు. కాగా, ఈ నెల 14న జరిగిన పార్టీకి మాత్రమే కాకుండా.. అభిషేక్‌ సింగ్‌ ఇప్పటికి 24 సార్లు రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ లో జరిగిన పార్టీలకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది.


ప్రస్తుతం సిట్‌తోపాటు ఎస్‌వోటీ బృందం కూడా అభిషేక్‌ సింగ్‌ నుంచి సమాచారం రాబడుతున్నట్లు, అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కొన్ని టీమ్‌లు విచారణ నిమిత్తం పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలిసింది. మరోవైపు ఈ కేసులో మిగతా నిందితులైన ఆరుగురిని శనివారం రాత్రి వరకు శంషాబాద్‌లో సిట్‌ బృందం విచారించింది. అభిషేక్‌ సింగ్‌ నుంచి ఇంకా ఎవరెవరు డ్రగ్స్‌ కొనుగోలు చేశారనే విషయంపైనా సిట్‌ దృష్టి సారించింది. ఈ మేరకు అభిషేక్‌ సింగ్‌ సెల్‌ఫోన్‌ డేటాను విశ్లేషిస్తున్నారు. మొయినాబాద్‌ ఫాంహౌస్‌ కాల్పులు, డ్రగ్స్‌ కేసు విచారణలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా ఈ ఫాంహౌస్‌ కేంద్రంగానే నడిచింది. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. అప్పట్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విదేశాల నుంచి తీసుకొచ్చిన ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలను కొన్నింటిని ఈ ఫాంహౌస్‌లోనే దాచినట్లు ఆరోపణలు రావడంతో నామమాత్రపు సోదాలు చేశారు. అయితే ఇప్పుడు డ్రగ్స్‌ కేసు విచారిస్తున్న పోలీసులు ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలపై కూడా మళ్లీ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. కాల్పులు, డ్రగ్స్‌ కేసులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు రోహిత్‌రెడ్డితోపాటు రితీశ్‌రెడ్డి, నమిత్‌ శర్మల కస్టడీ కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై ఉప్పరిపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది.


ఈ పిటిషన్‌పై గత బుధవారం వాదనలు జరగగా.. తీర్పును కోర్టు రిజర్వు చేసింది. అయితే కస్టడీకి అనుమతి రాగానే విచారణ వేగవంతం చేసేందుకు సిట్‌ బృందం సిద్ధంగా ఉంది. కాగా, మొయినాబాద్‌ డ్రగ్స్‌ పార్టీకి కేంద్ర బిందువుగా ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ను సీజ్‌ చేసేందుకు రెవెన్యూ అధికారుల రంగం సిద్ధం చేశారు. ఫాంహౌస్‌కు సంబంధించిన భూమి వివరాలు ఇవ్వాలని పోలీసులు ఇటీవలే రెవెన్యూ అధికారులను కోరగా.. వారు రికార్డులను పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌ రెవెన్యూ సర్వే నంబర్‌ 177/33లో 3-39 ఎకరాల్లో రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ ఉంది. అయితే ఈ భూమిని అజీజ్‌నగర్‌కు చెందిన అంతంగారి జంగయ్యకు ప్రభుత్వం 1961-62 సంవత్సరంలో 3-29 ఎకరాలు అసైన్‌ చేసింది. దీనిని 2006లో రోహిత్‌రెడ్డ్డి కొనుగోలు చేసి తన తండ్రి విఠల్‌రెడ్డి పేరిట రిజిస్ర్టేషన్‌ చేయించాడు. కానీ, అది అసైన్డ్‌ భూమి కావడంతో రిజిస్ట్రేషన్‌ జరిగినా మ్యుటేషన్‌ కాలేదు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో (భూభారతి పోర్టల్‌లో సైతం) అసైనీ అంతంగారి జంగయ్య పేరే ఆ భూమి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. మరోవైపు ఫాంహౌస్‌ సీజ్‌ చేస్తే న్యాయపరమైన చిక్కులు రాకుండా అందుకనుగుణంగా నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. సిట్‌ నుంచి లేఖ వచ్చిన వెంటనే ఫాంహౌస్‌ను సీజ్‌ చేయడం ఖాయమని అధికారులు చెబుతున్నారు. నేడో రేపో ఆదేశాలు వస్తాయని అంటున్నారు. ఫాంహౌస్‌ను ఇప్పటికే పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 06:28 AM