Share News

నేటి నుంచే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:18 AM

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ఎల్బీ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. సీఎం రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌.....

నేటి నుంచే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • మధ్యాహ్నం 3.30 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రారంభం

హైదరాబాద్‌/బర్కత్‌పుర, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు ఎల్బీ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతాయి. సీఎం రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు ఉభయసభల సభ్యులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ‘లెజిస్లేచర్‌ స్పోర్ట్స్‌ మీట్‌-2026’లో రెండు రకాల అథ్లెటిక్స్‌ గేమ్స్‌తో పాటు మరో 8 రకాల క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. అలాగే రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఈ మేరకు వివరాలను అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ పోటీల్లో భాగంగా 100 మీటర్ల రన్నింగ్‌, 400 మీటర్ల వాకింగ్‌ వంటి రెండు అథ్లెటిక్స్‌ గేమ్స్‌తో పాటు బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, టగ్‌ ఆఫ్‌ వార్‌, పవర్‌ లిఫ్టింగ్‌, వాలీబాల్‌, టేబుల్‌ టెన్నిస్‌ వంటి 8 రకాల క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎల్బీ స్టేడియంలో క్రీడా ఏర్పాట్లను స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, ఎండీ సోనిబాలాదేవి పరిశీలించారు. క్రీడా పోటీలను సీఎం రేవంత్‌ ప్రారంభిస్తారని.. రవీంద్రభారతిలో ముగింపు వేడుకలు జరుగుతాయని వారు తెలిపారు.

క్రీడా పోటీల్లో పాల్గొనేది లేదు: కేటీఆర్‌

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొనబోమని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొంటున్న సమయంలో క్రీడా పోటీలు నిర్వహించి సమయం వృథా చేయడం తగదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సభను మరో 10 రోజుల పాటు కొనసాగించి ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాలని ఆయన కోరారు.

Updated Date - Mar 28 , 2026 | 05:18 AM