మంత్రుల చాంబర్లలో ఎమ్మెల్యేల సందడి
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:38 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో నియోజకవర్గ సమస్యలపైన అధికార, విపక్ష ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు.
సిరిసిల్ల పవర్‌లూమ్ సమస్యలపై తుమ్మలతో కేటీఆర్ చర్చ
పొన్నంతో బీజేపీ ప్రజాప్రతినిధుల సమావేశం
హైదరాబాద్, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో నియోజకవర్గ సమస్యలపైన అధికార, విపక్ష ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రుల ఛాంబర్లకు వెళ్లి సమస్యలు వివరించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి పవర్‌లూమ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. తమ నియోజకవర్గాల్లో ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచాలని, కొత్త సర్వీసులు నడపాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రామచంద్రనాయక్, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకటేశ్వర్‌రావు తదితరులు తమ ప్రాంత సమస్యలను మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లారు.