నా తండ్రి నుంచి నాకు ప్రాణహాని
ABN , Publish Date - Aug 07 , 2026 | 06:13 AM
తన తండ్రి నుంచి తనకు, తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కుటుంబానికి ప్రాణ హాని ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌పై ఆయన కుమారుడు సంతోష్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ప్రేమించిన అమ్మాయితో నిశ్చితార్థం
చేసుకున్నానని.. ఆమె ఇంటిపై దాడులు
ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌పై తనయుడు సంతోష్ ఆరోపణ
తనకు, కాబోయే భార్య కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి
హైదరాబాద్ సిటీ/నార్సింగి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తన తండ్రి నుంచి తనకు, తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కుటుంబానికి ప్రాణ హాని ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌పై ఆయన కుమారుడు సంతోష్ తీవ్ర ఆరోపణలు చేశారు. గురువారం నార్సింగి పోలీస్ స్టేషన్ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ప్రేమించిన యువతి గురించి తన కుటుంబ సభ్యులకు తెలియజేసి, నిశ్చితార్థం కూడా చేసుకున్నానని.. అయితే తమ ప్రేమ వివాహాన్ని తన కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని సంతోష్ వెల్లడించారు. తన తండ్రికి ఈ నిశ్చితార్థం ఇష్టం లేకపోవడంతో.. తన కాబోయే భార్య ఇంటిపై దాడి చేయించి, తమను చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు. దీనిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా తమ ఫిర్యాదును స్వీకరించలేదని ఆరోపించారు. తనకు, తన కాబోయే భార్య కుటుంబ సభ్యులకు వెంటనే పోలీసు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ నాయకురాలు పట్లోళ్ల రూపారెడ్డి కుమార్తెతో తనకు జూలై 8న నిశ్చితార్థం జరిగిందని.. అప్పట్నుంచీ తాను వారి ఇంట్లోనే ఉంటున్నానని సంతోష్ వివరించారు.
ఈ వివాహం తన తండ్రికి ఇష్టం లేకపోవడంతో.. తనను లక్ష్యంగా చేసుకుని, రూపారెడ్డి ఇంటిపై ఆయన దాడి చేయించారని, సుమారు 40 మందిని పంపించి అప్పుల పేరుతో గొడవ చేయించి, తలుపులు, ఇంట్లో వస్తువులను ధ్వంసం చేయించారని వాపోయారు. తనను హత్య చేయడమే వారి అసలు లక్ష్యమని పేర్కొన్నారు. ‘‘నేను ఇక్కడ ఉన్నట్లు తెలిసిన తర్వాత కూడా.. ఎవరో అప్పులు ఇచ్చారని చెప్పి దాడులు చేయించారు. పిటిషన్‌లు ఇప్పించి, ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారని కూడా చూడకుండా దాడి చేయడం ఎంత వరకు న్యాయం? నేను నా జీవితం మీద ఆశలు వదులుకొని మాట్లాడుతున్నా. ఇది బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని ఏక్షణమైనా చంపేయవచ్చు. పోలీస్ స్టేషన్‌లో గానీ, కోర్టులో గానీ నాకు న్యాయం జరుగుతుందని అనుకోవడం లేదు. అన్ని ఆశలూ వదులుకొని మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. 100 శాతం నాకు హాని ఉంది. ’’ అని సంతోష్ వాపోయారు.
బాధ్యత నా తండ్రిదే..
తనకు, తన కాబోయే భార్యకు, కాబోయే అత్త రూపారెడ్డికి ఏదైనా అపాయం జరిగితే అందుకు తన తండ్రి ప్రకాశ్ గౌడ్‌నే బాధ్యుడిగా భావించాలని సంతోష్ స్పష్టం చేశారు. తమకు తక్షణ భద్రత కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే.. సంతోష్ చేసిన ఆరోపణపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్పందించారు. అతడితో తనకు సంబంధం లేదని, ఆ విషయం గురించి మాట్లాడదల్చుకోలేద ని చెప్పారు. దీనిపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతానన్నారు. మరోవైపు.. పెట్టుబడులపై అధిక లాభాలు వస్తాయని చెప్పి, పలువురు వ్యక్తుల నుంచి రూపారెడ్డి భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా.. ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచామని, కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండు విధించిందని పోలీసులు తెలిపారు. రూపారెడ్డిని నమ్మి మోసపోయామంటూ పలువురు నార్సింగి పీఎస్ వద్ద ఆందోళన చేశారు.