కేంద్ర పథకం పేరిట ఎమ్మెల్యే పల్లాకు లక్ష టోకరా
ABN , Publish Date - Apr 09 , 2026 | 07:13 AM
సాధారణ ప్రజలనే కాదు, ప్రజాప్రతినిధులను కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బురిడీ కొట్టించిన ఓ కేటుగాడు, లక్ష రూపాయలు కాజేశాడు.
బంజారాహిల్స్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): సాధారణ ప్రజలనే కాదు, ప్రజాప్రతినిధులను కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బురిడీ కొట్టించిన ఓ కేటుగాడు, లక్ష రూపాయలు కాజేశాడు. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తాను తెలంగాణ ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న అనంతరామిరెడ్డిని అంటూ సదరు వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ‘వికసిత్ భారత్’ పథకం కింద అర్హులైన వారికి రూ. 10 లక్షల వరకు రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. మీ నియోజకవర్గంలో ఒక 40 మంది జాబితా పంపిస్తే, వారికి వెంటనే రుణాలు మంజూరు చేయిస్తానని ఆశ చూపాడు. అయితే దరఖాస్తుకు ఇదే చివరి రోజని, ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున 40 మందికి రూ.1లక్ష ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని కోరాడు. తన నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆ మొత్తాన్ని ఫోన్ పే ద్వారా పంపించారు. కొద్దిసేపటి తర్వాత డబ్బులు అందలేదని, మళ్లీ పంపించాలని ఆ వ్యక్తి అడగడంతో ఎమ్మెల్యేకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా సదరు వ్యక్తి ఒక మోసగాడని గ్రహించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.