అవును.. రేవంత్‌రెడ్డి రెన్యువల్ ముఖ్యమంత్రే!
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:25 AM
అవును సీఎం రేవంత్‌రెడ్డి.. రెన్యువల్ సీఎం..! ఆయన్ను తెలంగాణ ప్రజలు ప్రతీ ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్ చేస్తారు. అలా ఆయన సీఎంగా కొనసాగుతూనే ఉంటారు.
ప్రతి ఐదేళ్లకు ప్రజలు రెన్యువల్ చేస్తారు: ఎమ్మెల్యే మేడిపల్లి
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : ‘‘అవును సీఎం రేవంత్‌రెడ్డి.. రెన్యువల్ సీఎం..! ఆయన్ను తెలంగాణ ప్రజలు ప్రతీ ఐదేళ్లకు ఒకసారి రెన్యువల్ చేస్తారు. అలా ఆయన సీఎంగా కొనసాగుతూనే ఉంటారు..’’ అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి.. రెన్యువల్ సీఎం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆదివారంనాడు ఓ ప్రకటనలో ఈ మేరకు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్టయిందని, సెకండాఫ్.. బ్లాక్ బస్టర్, బంపర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సెకండా్‌ఫలో కేటీఆర్‌కు బొమ్మ చూపిస్తామన్నారు. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దండుపాళ్యం ముఠాలా దోచుకుందన్నారు. కల్వకుంట్ల కుటుంబసభ్యురాలు కవితే.. బీఆర్‌ఎస్ పార్టీని, ఆ పార్టీ పాలనను సమర్థించట్లేదని, ఇంక తెలంగాణ ప్రజలు ఎందుకు పట్టించుకుంటారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు రావడం, రేవంత్‌రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయమన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదన్నారు.