ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
ABN , Publish Date - May 24 , 2026 | 05:10 AM
ఫోన్ ట్యాపింగ్ కేసులో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డిని శనివారం సిట్ అధికారులు విచారణ జరిపి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డిని శనివారం సిట్ అధికారులు విచారణ జరిపి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం మధుసూదన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని సిట్ అధికారులు చెప్పే వరకు తనకు తెలియదన్నారు. మహబూబ్‌నగర్ డీసీసీ అధ్యక్షుడిగా తాను పనిచేసిన సమయంలో 2022 జులై 13 నుంచి తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అధికారులు వివరించారని తెలిపారు. దేశద్రోహులు, దేశభద్రతకు ప్రమాదకరంగా మారిన వారి పేరుతో ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలకు సంబంధించిన వందలాది ఫోన్లను గత ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుదిదశకు చేరిందని, మరో రెండు వారాల్లో తుది చార్జీషీట్ దాఖలు చేయడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.