అమ్మా.. ఎక్కడున్నావ్?
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:19 AM
బిడ్డలు ఆడినా.. అల్లరి చేసినా అమ్మ నీడలోనే.. అమ్మ కాసేపు కనిపించకపోతేనే బిడ్డలు అల్లాడిపోతారు. అలాంటిది 25 రోజులుగా అమ్మ జాడ తెలియకపోతే ...
కూలీ పనికి వెళ్లి తల్లి మిస్సింగ్
25 రోజులుగా అల్లాడుతున్న ఇద్దరు కూతుళ్ల
తండ్రి కూడా లేకపోవటంతో ఎవరిని అడగాలో తెలియక కన్నీళ్లు
బషీరాబాద్ పీఎస్‌లో కేసు నమోదు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బషీరాబాద్, జూలై 4 (ఆంధ్రజ్యోతి): బిడ్డలు ఆడినా.. అల్లరి చేసినా అమ్మ నీడలోనే.. అమ్మ కాసేపు కనిపించకపోతేనే బిడ్డలు అల్లాడిపోతారు. అలాంటిది 25 రోజులుగా అమ్మ జాడ తెలియకపోతే ఆ బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుంది..? అసలే తండ్రి లేడు.. అమ్మ ఎక్కడ ఉందో, ఏమైందో తెలియదు. ఆకలైతే ఎవరిని అడగాలో, రాత్రి అయితే ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాక ఆ బిడ్డలు తల్లడిల్లి పోతున్నారు. ‘అమ్మా.. ఎక్కడున్నావ్? త్వరగా ఇంటికి రా’ అని నిత్యం కన్నీళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ చిన్నారుల ఆక్రందన జీవన్గి గ్రామంలో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన ఎనుముల మహేశ్వరి (35) కూలీ పని కోసం జూన్ 8న వికారాబాద్ వెళ్లి కనిపించకుండా పోయింది. ఆమెకు భర్త లేడు. ఇద్దరు కుమార్తెలు అలకనంద (10), భువనేశ్వరి (12) ఉన్నారు. తల్లి జాడ తెలియకపోవటంతో ఆ బాలికలు కన్నీరుమున్నీరవుతున్నారు. మహేశ్వరి సోదరుడు వీరన్న ఫిర్యాదు మేరకు బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మహేశ్వరి మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కాల్ డేటా ఆధారంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన బెంజమిన్ అనే వ్యక్తిని విచారించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో తనకు ఆ ఫోన్ దొరికిందని చెప్పటంతో ఈ కేసుతో అతనికి సంబంధం లేదని తేల్చారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో కొందరు వ్యక్తులు ఒక మహిళను బలవంతంగా తీసుకెళ్లటం కొందరు చూసినట్లు విచారణలో తెలిసింది. దీంతో తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ రెడ్డి, ఎస్‌ఐ విఠల్ ఆధ్వర్యంలో పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. త్వరలోనే మహేశ్వరి ఆచూకీ కనుగొంటామని పోలీసులు భరోసా ఇస్తున్నారు.