Reunion: మూడేళ్ల వయసులో తప్పిపోయి... 27 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
ABN , Publish Date - Jan 17 , 2026 | 06:31 AM
మూడేళ్ల వయసులో ఓ జాతర్లో తప్పిపోయిన ఆ బాలుడు, 27 ఏళ్ల తర్వాత మళ్లీ కన్నవారి చెంతకు చేరాడు. ఇరవై ఏడేళ్ల క్రితం, జాతర్లో తప్పిపోయిన ఆ మూడేళ్ల బాలుడిని...
మెదక్ జిల్లా అల్లాదుర్గం జాతరలో తప్పిపోయిన బాలుడు
చేరదీసిన అదే జిల్లా దంపతులు
ఆపై కర్ణాటకకు మకాం మార్పు
నాటకీయ ఫక్కీలో మళ్లీ తల్లిదండ్రుల చెంతకు యువకుడు
రేగోడు జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మూడేళ్ల వయసులో ఓ జాతర్లో తప్పిపోయిన ఆ బాలుడు, 27 ఏళ్ల తర్వాత మళ్లీ కన్నవారి చెంతకు చేరాడు. ఇరవై ఏడేళ్ల క్రితం, జాతర్లో తప్పిపోయిన ఆ మూడేళ్ల బాలుడిని ఓ జంట అక్కున చేర్చుకుంది. అతడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చే యత్నం చేయకపోగా, తమకు పిల్లల్లేకపోవడంతో గుట్టుగా సొంత ఊరు నుంచి మరో ప్రాంతానికి మకాంమార్చేసింది. కన్న తల్లిదండ్రులు, బాధిత యువకుడి కథ నం ప్రకారం.. మెదక్‌జిల్లా రేగోడు మండలం పెద్ద తండాకు చెందిన దేవులీబాయి, రూప్‌సింగ్ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 27 ఏళ్ల క్రితం అల్లాదుర్గంలో బేతాళస్వామి జాతరకు పిల్లలతో కలిసి రూప్‌సింగ్ దంపతులు వెళ్లారు. ఆ జాతర్లో వారి మూడో కుమారుడైన రవీందర్ నాయక్ తప్పిపోయాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ జాతరకు కంగ్టి మండలంలోని బాబుల్‌గావ్ తండాకు చెందిన శ్యామ్‌రావు, చాందిబాయి దంపతులు వచ్చారు. తప్పిపోయి ఏడుస్తున్న రవీందర్‌ను చూసి దగ్గరకు తీసుకున్నారు. తమకు పిల్లలు లేకపోవడంతో రవీందర్‌ను వెంట తీసుకెళ్లి పెంచుకోవాలనుకున్నారు. పథకం ప్రకారం మకాంను కర్ణాటకలోని సంత్‌పూర్‌కు మార్చా రు. బుద్ధితెలిశాక ఆ బాలుడు.. తన పెంపుడు తల్లిదండ్రులను నిలదీశాడు. తనను బస్సులో ఎక్కించుకొని తీసుకొచ్చినట్లు మాత్రం గుర్తుందని, తన కన్నవారెవరో చెప్పాలని శ్యామ్‌రావు దంపతులను ప్రశ్నించాడు. అయినా వారు దాటవేస్తూ వచ్చారు. రవీందర్‌కు చదువు చెప్పించకుండా కూలి పనులకు పంపారు. యువకుడయ్యాక రవీందర్ ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు.
పదేళ్ల క్రితం చాందిబాయి పుట్టిల్లయిన దామరిగిద్ద తండాకు చెంది న బంధువుల అమ్మాయినిచ్చి రవీందర్‌కు పెళ్లి చేశారు. అతడికి ఇద్దరు మగపిల్లలు కలిగారు. రెండేళ్ల క్రితం శ్యామ్‌రావు, చాందిబాయి వృద్ధాప్య సమస్యలతో చనిపోయారు. ఆరేళ్లుగా రవీందర్, కుటుంబంతో దామరగిద్ద తండాలోనే ఉంటున్నాడు. ఇటీవల తండాలో కొందరితో జరిపిన చర్చోపచర్చ ల ద్వారా తన కన్నతల్లిదండ్రులెవరనేది రవీందర్‌కు తెలిసింది. వెంటనే వెళ్లి తల్లిదండ్రులు దేవులీబాయిని రూప్‌సింగ్‌ను రవీందర్ కలుసుకున్నాడు. తనను శుభాశుభ కార్యాల కోసం ఇతర తండాలకు తీసుకెళితే.. తెలిసిన వారు నిలదీస్తారనే భయంతో పెంచిన తల్లిదండ్రులు తనను సంత్‌పూర్‌ను దాటనిచ్చేవారు కాదని, ఎట్టకేలకు కన్నవారి చెంతకు చేరుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని రవీందర్ చెప్పాడు. తమ కుమారుడు మళ్లీ తమ దగ్గరకు రావడం సంతోషంగా ఉందని, ఈ సంక్రాంతి సంబురం పదింతలైందని దేవులీబాయి, రూప్‌సింగ్ ఆనందం వ్యక్తం చేశారు.