నిధులు గోల్మాల్
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:33 AM
సహకార సంఘాల్లో పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించే రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే మూడు శాతం రిబేట్ నిధుల విషయంలో జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో ఓ వివాదం తెరపైకి వచ్చింది. జిల్లా కేంద్రం
జగిత్యాల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సహకార సంఘాల్లో పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించే రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే మూడు శాతం రిబేట్ నిధుల విషయంలో జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో ఓ వివాదం తెరపైకి వచ్చింది. జిల్లా కేంద్రం కావడంతో ప్రతి నిత్యం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పర్యటనలు, పర్యవేక్షణలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవనరెడ్డిలు సైతం జగిత్యాల పీఏసీఎస్‌లో ప్రాథమిక సభ్యులుగా ఉన్నారు. అయినప్పటికీ రైతులకు చెందిన రిబేట్ నిధుల గోల్మాల్ చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. అర్హులైన సభ్యుల ఖాతాల్లో జమ కావాల్సిన రిబేట్ మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా గత పాలకవర్గం వినియోగించినట్లు పీఏసీఎస్ నాన అఫీషియల్ (పర్సన ఇనచార్జి కమిటీ) పీఐసీ గుర్తించింది. మొత్తం రూ.28,64,164కు సంబంధించిన లావాదేవీలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని పాలకవర్గం ఉన్నతాధికారులను కోరింది. ఈనెల 18న జరిగిన పీఐసీ కమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. అయితే ఈ మొత్తాన్ని ఎవరు బ్యాంకు నుంచి నగదు వితడ్రా చేశారు..? నిబంధనలకు అనుగుణంగానే ఖర్చు చేశారా..? లేక సభ్యులకు చెందాల్సిన రిబేట్ నిధులు దారి మళ్లాయా..? అన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. పీఏసీఎస్ లావాదేవీలపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్ జరపాల్సిన అధికారులు సైతం అవకతవకలను గుర్తించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫచెక్కులతో.. నగదు రూపంలో..
జగిత్యాల పీఏసీఎస్‌లో 2021-22 సంవత్సరంలో తమ పంట రుణాన్ని సకాలంలో చెల్లించిన రైతులకు 2023-24 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మూడు శాతం రాయితీ సొమ్మును సహకార సంఘం ఖాతాలో జమ చేసింది. అయితే ఈ రాయితీ సొమ్మును సంబంధిత అర్హులైన రైతుల ఖాతాల్లో పీఏసీఎస్ నుంచి జమ చేయాల్సి ఉంటుంది. రిబేటు సొమ్మును రైతుల ఖాతాలో జమ చేయకుండా దుర్వినియోగానికి పాల్పడినట్లుగా ఆరోపణలు తెరపైకి వచ్చాయి. పీఐసీ కమిటీ రికార్డుల ప్రకారం రిబేట్‌కు సంబంధించిన మొత్తంలో 2022 జూలై 27వ తేదీన రూ.5 లక్షలు, 2022 ఆగస్టు 2వ తేదీన రూ. 4 లక్షలు, పీఏసీఎస్‌కు చెందిన మరో ఖాతా నుంచి 2024 నవంబరు 26వ తేదీన రూ.4 లక్షలు, మరోమారు రూ.4 లక్షలు, రూ. 6 లక్షలు, ఇంకో మారు రూ.6.34 లక్షలు ఇలా పలు విడతల్లో చెక్కులు, నగదు రూపంలో ఉపసంహరణలు జరిగినట్లు గుర్తించారు. ఇందులో ముఖ్యంగా రూ.28,64,164 నిధులను దుర్వినియోగం చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫచెక్కు అధికారం ఎవరిది?
సహకార సంఘం ఖాతా నుంచి డబ్బులు డ్రా చేయడానికి అవసరమైన చెక్కు అధికారం చైర్మన, సెక్రెటరీలకు ఉంటుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. అయితే సభ్యుల ప్రయోజనాల కోసం జమ కావాల్సిన రిబేట్ నిధులు ఇతర అవసరాలకు మళ్లించారా..? అన్న అనుమానాలకు తావిచ్చేలా లావాదేవీలు ఉన్నాయని పీఏసీ కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా చెక్కులపై సంతకాలు చేసిన వారు ఎవరు..? నగదు ఎవరికి అందింది..? ఖాతాల నుంచి డ్రా చేసిన సొమ్మును ఎక్కడ వినియోగించారు..? రిబేట్ పొందాల్సిన సభ్యుల వివరాలు ఏమిటి..? వారికి ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంది...? అన్న అంశాలపై పూర్తిస్థాయి విచారణ అవసరమని పాలకవర్గం భావిస్తోంది. ఖాతా పుస్తకాలు, చెక్కులు, బ్యాంకు స్టేట్మెంట్లు, వోచర్లు, తీర్మానాలు, సభ్యుల రిబేట్ జాబితాలను సమగ్రంగా పరిశీలిస్తేనే వ్యవహారంలోని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఫసెక్షన 51 కింద విచారణకు సిఫారసు...
రిబేట్ నిధుల వ్యవహారంపై తెలంగాణ సహకార సంఘాల చట్టంలోని సెక్షన51 కింద విచారణ జరిపించాలని జిల్లా సహకార అధికారి/సహకార సంఘాల డిప్యూటీ రిజిసా్ట్రర్‌కు సిఫారసు చేయాలని పాలకవర్గం నిర్ణయించింది. ఈ మేరకు సిఫారసు లేఖలను సంబంధిత అధికారులకు పంపారు. కరీంనగర్ కేడీసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారికి సైతం సమాచారం నిమిత్తం లేఖల ప్రతులను పంపారు. నిధుల వినియోగంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా..? బాధ్యులు ఎవరైనా ఉన్నారా..? ఉంటే ఎంత మొత్తానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది..? సభ్యులకు రావాల్సిన రిబేట్‌ను తిరిగి ఎలా చెల్లించాలి..? అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఇప్పటికే రూ.28.64 లక్షల లావాదేవీలపై అనుమానాలు వ్యక్తం కావడంతో సహకార వర్గాల్లో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది.
అవకతవకలపై విచారణ జరపాలని కోరాం
-కొలుగూరి దామోదర్‌రావు, ప్యాక్స్ చైర్మన, జగిత్యాల
జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రాయితీ సొమ్ము దుర్వినియోగంపై అవసరమైన విచారణను జరపాలని ఉన్నతాధికారులను కోరాం. నిర్ణీత కాలానికి చెందిన రికార్డులను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే రాయితీ సొమ్ము పక్కదారి పట్టినట్లుగా ప్రాథమికంగా గుర్తించాము. అధికారుల విచారణలో నిజా నిజాలు తేలాల్సి ఉంది.