Share News

నిద్రలోనే నిండు జీవితాలు ఆహుతి

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:09 AM

గాఢనిద్రలోనే మూడు నిండు జీవితాలు అగ్నికి ఆహుతయ్యాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని కలాల్‌గూడలో ఈ విషాదం చోటుచేసుకుంది.

నిద్రలోనే నిండు జీవితాలు ఆహుతి

  • అగ్నిప్రమాదంలో అమ్మమ్మ, మనుమల మృతి

  • షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు

  • సిలిండర్‌ పేలి పూర్తిగా దగ్ధమైన ఇల్లు

  • నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం

మిర్యాలగూడ అర్బన్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): గాఢనిద్రలోనే మూడు నిండు జీవితాలు అగ్నికి ఆహుతయ్యాయి. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని కలాల్‌గూడలో ఈ విషాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మొదలైన మంటలు వంటగ్యాస్‌ సిలిండర్‌ను తాకడంతో క్షణాల్లో అగ్నికీలలు చెలరేగి ఇంటి నిండా వ్యాపించాయి. నిద్రలో ఉన్న అమ్మమ్మ, మనుమడు, మనుమరాలు మేల్కొని ఆర్తనాదాలు చేస్తూనే సజీవ దహనమైపోయారు. కలాల్‌వాడలో నివాసం ఉంటున్న వనం చంద్రకళ (55) భర్త సైదులు పక్షవాతంతో బాధపడుతూ నెలరోజుల క్రితమే మరణించారు. వారి కుమార్తె ధనమ్మ తన ఇద్దరు పిల్లలు లక్ష్మణ్‌ (16), ప్రణతి (14)లతో సహా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమె భర్త పదేళ్ల క్రితమే అనారోగ్యంతో చనిపోయారు. పుణెలో ఓ ఇంట్లో కేర్‌టేకర్‌గా పనిచేసేందుకు 10రోజుల క్రితమే ధనమ్మ అక్కడికి వెళ్లింది. ఈ క్రమంలో ఇంట్లో చంద్రకళ, లక్ష్మణ్‌, ప్రణతి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో విద్యుత్‌ వైర్లలో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి నిప్పురవ్వలు చెలరేగి సమీపంలో ఉన్న దుస్తులకు మంటలంటుకున్నాయి. మంటలు క్షణాల్లో గ్యాస్‌ సిలిండర్‌ వరకూ విస్తరించాయి. సిలిండర్‌ పేలిపోయి దట్టమైన అగ్నికీలలు అలుముకుని ముగ్గురూ కాలి బుగ్గి అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. భర్త సైదులు మరణించి నెల అవుతున్న సందర్భంగా శనివారం మాసికం నిర్వహించేందుకు చంద్రకళ సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషాద ఘటన జరిగిందని స్థానికులు గుర్తు చేశారు. ధనమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

Updated Date - Jun 06 , 2026 | 04:10 AM