Share News

మిర్చి అధరహో!

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:20 AM

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధర రెండు రోజుల్లోనే క్వింటాలుకు రూ.4 వేల వరకు పెరిగింది. బుధవారం తేజా రకం మిర్చిని క్వింటాలు రూ.20 వేల జెండాపాట ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు.

మిర్చి అధరహో!

  • ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.20 వేలు

ఖమ్మం మార్కెట్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధర రెండు రోజుల్లోనే క్వింటాలుకు రూ.4 వేల వరకు పెరిగింది. బుధవారం తేజా రకం మిర్చిని క్వింటాలు రూ.20 వేల జెండాపాట ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. కొత్త మిర్చిని మార్కెట్‌లో కొంతకాలంగా క్వింటాలు రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు మాత్రమే కొంటున్న వ్యాపారులు వారం రోజుల వ్యవధిలో ధరను రూ.1,500 నుంచి రూ.4 వేల వరకు పెంచి కొనుగోలు చేయడం విశేషం. ఈ నెల 18న రూ.15,850 పలికిన మిర్చి.. 19న రూ.16,300, 20న రూ.17,600 తాజాగా బుధవారం రూ.20 వేలు పలికింది. మిర్చికి అత్యధిక ధర పలకడం ఈ సీజన్‌లో ఇదే ప్రథమం. 2023లో క్వింటాలుకు రూ.25 వేలు రికార్డు ధర పలకగా 2024, 2025లో ధరలు పడిపోతూ వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది మిర్చి పంటను తక్కువగా సాగు చేయడంతో పాటు నల్ల తామర పురుగు, ఇతర తెగుళ్ల బెడద నేపథ్యంలో దిగుబడి తగ్గుతుందన్న అంచనా మేరకు వ్యాపారులు మార్కెట్‌కు వచ్చిన పంటను వచ్చినట్టు కొంటున్నారు. గతంలో రూ.12 వేల నుంచి రూ.14 వేలలోపే పలకడంతో గిట్టుబాటు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్ట పోయారు. దీంతో ప్రస్తుతం పెరుగుతున్న ధరలు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి మిర్చి పంట మార్కెట్‌కు పోటెత్తనున్న నేపథ్యంలో ధర రూ.20వేలకు తగ్గకుండా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు.

Updated Date - Jan 22 , 2026 | 05:20 AM