Share News

మైనార్టీ పథకాల పోర్టల్‌లో 8 జిల్లాలు మాయం!

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:17 AM

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక పథకాల అమలులో తీవ్రమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది.

మైనార్టీ పథకాల పోర్టల్‌లో 8 జిల్లాలు మాయం!

  • గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక పథకాల అమలులో తీవ్రమైన నిర్లక్ష్యం కనిపిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ప్రకటించిన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌, తురకకాశీ పథకాల ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియలో 8 జిల్లాల పేర్లు కనిపించకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికారిక టీజీవోబీఎంఎంఎస్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, జయశంకర్‌ భూపాలపల్లి, కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, ములుగు జిల్లాల పేర్లు జాబితాలో కనిపించడం లేదు. దీనివల్ల ఆయా జిల్లాలకు చెందిన ముస్లిం, బౌద్ధ, సిక్కు, జైన, పార్శీ మైనార్టీ అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించలేకపోతున్నారు. మార్చి 1తో ఈ పథకాల దరఖాస్తుకు గడువు ముగుస్తుండటం, దానికి వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో వందలాది మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక లోపం సాకుగా చూపుతూ జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ వారి తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించి తమకు అవకాశం కల్పించాలని ఆయా జిల్లాల అభ్యర్థులు కోరుతున్నారు. ఆయా జిల్లాల పేర్లను పోర్టల్‌లో చేర్చి దరఖాస్తు గడువును పొడిగించాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.యాకూబ్‌ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

Updated Date - Feb 23 , 2026 | 02:17 AM