Share News

ఐదు నెలల గర్భంతో పరీక్షకు హాజరైన మైనర్‌

ABN , Publish Date - Feb 28 , 2026 | 03:39 AM

ఐదు నెలల గర్భంతో ఇంటర్‌ పరీక్షకు హాజరైన ఓ మైనర్‌ బాలిక.. పరీక్ష రాస్తుండగా తీవ్ర రక్తస్రావానికి గురై ఆపై స్పృహ తప్పిపడిపోయింది.

ఐదు నెలల గర్భంతో పరీక్షకు హాజరైన మైనర్‌

  • పరీక్ష రాస్తుండగా రక్తస్రావం.. స్పృహ తప్పి పడిపోయిన వైనం

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన

పాల్వంచ రూరల్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఐదు నెలల గర్భంతో ఇంటర్‌ పరీక్షకు హాజరైన ఓ మైనర్‌ బాలిక.. పరీక్ష రాస్తుండగా తీవ్ర రక్తస్రావానికి గురై ఆపై స్పృహ తప్పిపడిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల వసతి గృహంలో ఉంటూ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ఫస్టియిర్‌ చదువుతున్న ఓ బాలిక శుక్రవారం పరీక్ష రాసేందుకు స్థానికంగా తనకు కేటాయించిన కేంద్రానికి వచ్చింది. పరీక్ష మొదలైన గంట వ్యవధిలోనే ఆమె రక్తస్రావంతో బాధపడుతుండగా గమనించిన ఇన్విజలేర్లు.. పరీక్ష కేంద్రంలో అందుబాటులో ఉన్న ఏఎన్‌ఎంలకు విషయం తెలిపారు. ఏఎన్‌ఎంలు బాలికను ప్రశ్నించగా గర్భం సంగతి తెలిసింది. దీంతో అధికారులు.. బాలిక చదువుతున్న కళాశాలకు, హాస్టల్‌ వార్డెన్‌కు సమాచారమిచ్చారు. హాస్టల్‌ వార్డెన్‌ పరీక్ష కేంద్రానికి చేరుకునే సరికి ఆ బాలిక స్పృహ తప్పిపడిపోయింది. దీంతో ఆ బాలికను పాల్వంచలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాలిక ఐదు నెలల గర్భవతి అని, పరీక్షకు వచ్చే ముందు గర్భస్రావం మాత్రలు వినియోగించి ఉంటుందని, దానివల్లే తీవ్ర రక్తస్రావానికి గురై స్పృహ కోల్పోయిందని వైద్యులు తెలిపారు. మరోపక్క, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సదరు బాలిక గర్భం ఎలా దాల్చిందనే అంశంపై ఆరా తీస్తున్నారు. కాగా, వసతి గృహంలో ఉంటున్న బాలికకు గర్భం ఎలా వచ్చింది.. అందుకు కారకులెవరు? ఇంత జరుగుతున్నా హాస్టల్‌ నిర్వాహకులకు తెలియకపోవడమేంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Updated Date - Feb 28 , 2026 | 03:39 AM