Minister Konda Surekha: మంత్రి ఆదేశాలు బేఖాతరు
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:30 AM
దేవాదాయ శాఖలో ఇతర విభాగాల అధికారుల వలసలు మళ్లీ మొదలయ్యాయి! గతంలో ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఇచ్చిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఉన్నతాధికారులు డిప్యూటేషన్ల ప్రక్రియను వేగవంతం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దేవాదాయ శాఖలో మళ్లీ డిప్యూటేషన్ల కలకలం!
కొండా సురేఖ ఉత్తర్వులు పక్కనబెట్టిన అధికారులు
ఆందోళనకు సిద్ధమవుతున్న జేఏసీ
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖలో ఇతర విభాగాల అధికారుల వలసలు మళ్లీ మొదలయ్యాయి! గతంలో ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఇచ్చిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఉన్నతాధికారులు డిప్యూటేషన్ల ప్రక్రియను వేగవంతం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) నుంచి సహాయ కమిషనర్ వరకు ఇతర విభాగాల వారిని డిప్యూటేషన్‌పై తెచ్చేందుకు సచివాలయం స్థాయిలో ఫైళ్లు వేగంగా కదులుతున్నాయి. వాస్తవానికి, సొంత శాఖ అధికారుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్లు రద్దుచేస్తూ గతేడాది జూన్‌లోనే మంత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఆ ఆదేశాలను పక్కనబెట్టి పంచాయతీరాజ్, రెవెన్యూ, మునిసిపాలిటీ విభాగాల అధికారులను మళ్లీ దేవాదాయ శాఖలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయంపై దేవాదాయ ఉద్యోగ సంఘాలు (జేఏసీ) తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఏళ్ల తరబడి ఒకే హోదాలో పనిచేస్తున్న తమకు పదోన్నతులు కల్పించకుండా, ఖాళీలను ఇతర శాఖల వారితో భర్తీ చేయడం అన్యాయమని వారు వాపోతున్నారు. సర్వీస్ రూల్స్ ప్రకారం ఇతర శాఖల వారిని దేవాదాయ శాఖలోకి తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని, సీనియార్టీ జాబితా సిద్ధంగా ఉన్నప్పటికీ కావాలనే పదోన్నతులను నిలిపివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ముఖ్య కార్యదర్శి నుంచి డైరెక్టర్‌కు వచ్చిన తాజా లేఖతో ఉద్యోగులలో ఆందోళన మొదలైంది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ డిప్యూటేషన్ల ప్రయత్నాలను తక్షణమే విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ వ్యవహారంపై పునఃసమీక్ష జరపాలని వారు కోరుతున్నారు.