Ministers Invite KCR to Medaram Jatara: మేడారం జాతరకు రండి
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:54 AM
మేడారం మహా జాతరకు రావాలని కోరుతూ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆహ్వానించారు.
ఎర్రవల్లి వెళ్లి కేసీఆర్‌ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ
వారిని ఆత్మీయంగా పలకరించి, సత్కరించిన మాజీ సీఎం దంపతులు
హైదరాబాద్, మర్కుక్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మేడారం మహా జాతరకు రావాలని కోరుతూ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఆహ్వానించారు. గురువారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికివెళ్లిన మంత్రులు.. రాష్ట్రప్రభుత్వం తరఫున కేసీఆర్‌కు మేడారం జాతర ఆహ్వాన పత్రికను, ఆలయ ప్రసాదాన్ని, నూతన వస్త్రాలను అందజేశారు. శాలువా కప్పి కేసీఆర్‌ను సత్కరించారు. తన నివాసానికి వచ్చిన మహిళా మంత్రులను ‘బాగున్నారా.. అమ్మా..’ అంటూ కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. తన సతీమణి శోభతో కలిసి వారికి పసుపు, కుంకుమ, చీరలు పెట్టి సత్కరించారు. జాతరకు హాజరవుతానని చెప్పారు. మేడారం ఆలయ నిర్మాణ పనులు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయంటూ మంత్రులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్ని పార్టీల నేతలను స్వయంగా కలిసి మేడారం జాతరకు ఆహ్వానించామని.. అక్కడ కేసీఆర్‌ను కలిసే అవకాశం రాకపోవడంతో, ఫామ్‌హౌ్‌సకు వచ్చి ఆహ్వానించామని తెలిపారు. తమ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించి, జాతరకు వస్తానని కేసీఆర్ చెప్పడం ఆనందంగా ఉందన్నారు. పేద కుటుంబాలకు చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులకు కేసీఆర్ ఆర్థికసాయం అందించారు. ప్రమాదంలో మరణించిన ఎర్రవల్లి రైతు సత్తయ్య కుమారుడు నవీన్, అదే గ్రామానికి చెందిన పెద్దోళ్ల సాయిలు కుమారుడు అజయ్ ఇద్దరూ బీటెక్ చదివేందుకు నాలుగేళ్లపాటు కళాశాల ఫీజు చెల్లించనున్నట్టు.. పుస్తకాలు, కంప్యూటర్ కొనుగోలు కోసం కొంత తక్షణ ఆర్థిక సాయం అందజేసినట్టు కేసీఆర్ కార్యాలయం వెల్లడించింది.