Share News

CM Revanth Reddy: పార్లమెంట్‌ నియోజకవర్గానికో మంత్రి!

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:16 AM

రాష్ట్రంలో జరగనున్న మునిసిపల్‌ ఎన్నికలను అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించింది.

CM Revanth Reddy: పార్లమెంట్‌ నియోజకవర్గానికో మంత్రి!

  • మునిసిపోల్స్‌కు ఇన్‌చార్జిలుగా బాధ్యత

  • వచ్చే నెల 3 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా సీఎం రేవంత్‌ ప్రచారం

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరగనున్న మునిసిపల్‌ ఎన్నికలను అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించింది. మెజారిటీ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను దక్కించుకుని పట్టణ ప్రాంతాల్లోనూ పట్టు సాధించేందుకు సన్నద్ధమవుతోంది. 15 రోజుల పాటు సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలోనే ఉంటున్న నేపథ్యంలో మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలను సిద్ధం చేసే బాధ్యతను రాష్ట్ర మంత్రులకు అప్పగించారు. ఒక్కో మంత్రికి ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను గెలిపించే బాధ్యతను అప్పగించిన సీఎం.. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్పష్టం చేశారు. పార్టీ రహితమైన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 66 శాతం సర్పంచ్‌ సీట్లు గెలుచుకుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక పార్టీ గుర్తుపై జరిగే పురపాలక ఎన్నికల్లో మెజారిటీ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలను దక్కించుకుంటే.. పట్టణ ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్‌ సర్కారు పాలనా తీరుకు ఆమోదముద్ర వేసినట్లవుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్‌రెడ్డి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులకు మునిసిపోల్స్‌ బాధ్యతలను అప్పగించారు. ఫిబ్రవరి 14లోపే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో షెడ్యూల్‌ విడుదలకు ముందే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. అమెరికా నుంచి తిరిగి రాగానే సీఎం కూడా మునిసిపల్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలన్న డిమాండ్‌తో ఫిబ్రవరి 3 నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించనున్న సభలనే మునిసిపల్‌ ఎన్నికల ప్రచార వేదికలుగా మార్చుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మునిసిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా స్ర్కీనింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలుగా ఉన్న మంత్రులను ఈ కమిటీలకు చైర్మన్లుగా నియమించారు. నియోజకవర్గం పరిధిలోని డీసీసీ అధ్యక్షుడు కన్వీనర్‌గా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు ఒక్కో డివిజన్‌, వార్డుకు ఆరుగురు చొప్పున ఆశావహులను ఎంపిక చేసి టీపీసీసీకి నివేదిస్తాయి.గెలుపు, సామాజిక సమీకరణల ఆధారంగా అభ్యర్థులను టీపీసీసీ ఎంపిక చేయనుంది.

తిరుగుబాట్లు లేకుండా చేసేందుకే..!

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు శాతం 66 శాతం దగ్గరే ఆగిపోయింది. పది శాతం సీట్లలో రెబల్‌ అభ్యర్థులే గెలిచారని, అనేక చోట్ల తిరుగుబాటు అభ్యర్థుల కారణంగా సర్పంచ్‌ సీట్లు స్వల్ప తేడాతో బీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకుందని విశ్లేషిస్తున్నాయి. పార్టీ గుర్తుపై జరిగే మునిసిపల్‌ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుగుబాటు అభ్యర్థి లేకుండా చూడాలన్న నిర్ణయానికి వచ్చిన పార్టీ నాయకత్వం.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా చేపట్టింది. అసంతృప్త నాయకులను బుజ్జగించి తిరుగుబాట్లు లేకుండా చూసే బాధ్యతను మంత్రులు తీసుకోనున్నారు.

Updated Date - Jan 20 , 2026 | 02:16 AM