Share News

జర్మనీలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి వివేక్‌ బృందం భేటీ

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:32 AM

జర్మనీ పర్యటనలో ఉన్న రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి బృందం బుధవారం అక్కడి పలు సంస్థల..

జర్మనీలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి వివేక్‌ బృందం భేటీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): జర్మనీ పర్యటనలో ఉన్న రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి బృందం బుధవారం అక్కడి పలు సంస్థల ప్రతినిధులతో భేటీ అయింది. రాష్ట్ర యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించే విషయమై మంత్రి వివేక్‌ బృందం ఐదు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం జర్మనీకి బయలుదేరివెళ్లింది. జర్మనీలోని హానోవర్‌, బెర్లిన్‌, హామెలిన్‌ నగరాల్లో పర్యటించాలని నిర్ణయించగా.. బుధవారం హానోవర్‌లో జర్మన్‌ ఫెడరల్‌ ఎంప్లాయిమెంట్‌ ఏజెన్సీతో సమావేశమై తెలంగాణ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలపై చర్చించారు. నైపుణ్యం ఉన్న వారిని రాష్ట్రం నుంచి జర్మనీకి పంపే అవకాశాలను అన్వేషించారు. రాష్ట్రంలో టామ్‌కామ్‌ ద్వారా నిరుద్యోగ యువతకు పారిశ్రామిక సంబంధిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు మంత్రి వివేక్‌ ఏజెన్సీ బృందానికి వివరించారు. కాగా.. అంతర్జాతీయ నైపుణ్య వినియోగం, ఉద్యోగావకాశాల విస్తరణ అంశాలపై జర్మనీలోని లోయర్‌ సాక్సోని రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం ‘లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌’పై సంతకాలు చేశాయి. మంత్రి వివేక్‌, లోయర్‌ సాక్సోని రాష్ట్ర ఆర్థిక, పరిశ్రమలు, డిజిటలైజేషన్‌, మొబిలిటీ శాఖ మంత్రి గ్రాంట్‌ హెండ్రిక్‌ టోన్నే.. లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ను మార్చుకున్నారు.

Updated Date - Apr 10 , 2026 | 05:32 AM