Share News

Minister Uttam Kumar Reddy: పాలమూరుపై కేసీఆర్‌, హరీశ్‌ అబద్ధాలు

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:34 AM

పాలమూరు-రంగారెడ్డిపై కేసీఆర్‌, హరీశ్‌లు అవాస్తవాలు చెబుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

Minister Uttam Kumar Reddy: పాలమూరుపై కేసీఆర్‌, హరీశ్‌ అబద్ధాలు

  • 80 వేల కోట్లలో 27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90ు పనులు అయినట్లా?

  • రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టారు

  • మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డిపై కేసీఆర్‌, హరీశ్‌లు అవాస్తవాలు చెబుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేసినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. గురువారం ఆయన ప్రజాభవన్‌లో కృష్ణా, గోదావరి జలాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలపై బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నవన్నీ పూర్తిగా అబద్ధాలే అన్నారు. 10.6.2015న రూ.35 వేల కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో పాలమూరు-రంగారెడ్డికి పరిపాలన అనుమతి ఇచ్చారని చెప్పారు. రూ.35 వేల కోట్ల అంచనాల్లో డిస్ట్రిబ్యూటరీలు లేవని.. అవి కూడా కలిపితే నిర్మాణ అంచనా వ్యయం రూ.80 వేల కోట్లు దాటుతుందని తెలిపారు. అంటే రూ.80 వేల కోట్లలో రూ.27 వేల కోట్ల పనులు చేస్తే.. 90 శాతం పనులు పూర్తయినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జీవో ఇచ్చిన ఏడేళ్ల తర్వాత 13.9.2022లో డీపీఆర్‌ను కేంద్ర జలవనరుల సంఘాని (సీడబ్ల్యూసీ)కి సమర్పించారన్నారు. డీపీఆర్‌ సమర్పించిన రోజు ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయాన్ని రూ..55 వేల కోట్లుగా చూపించారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ వాళ్లు దిగిపోయే నాటికి రూ.27 వేల కోట్లు ఖర్చుపెట్టినా ఒక్క ఎకరా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో రూ.7 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. వాళ్లు వదిలిపెట్టి వెళ్లిన బకాయిలు కూడా కడుతున్నామన్నారు. తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాసిందే బీఆర్‌ఎస్‌ అని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌తో అలయ్‌బలయ్‌ చేసుకొని, చేపల పులుసు తిని.. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం పాలమూరు-రంగారెడ్డి సామర్థ్యాన్ని రోజుకు ఒక్క టీఎంసీకి తగ్గించారని ఆక్షేపించారు.

Updated Date - Jan 02 , 2026 | 04:34 AM