Share News

ఏపీ ప్రభావం వల్లే..రాష్ట్రంలో డిమాండ్‌

ABN , Publish Date - Apr 28 , 2026 | 06:32 AM

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని పెట్రోల్‌ బంకుల్లో నిల్వలు అడుగంటడం, సరిహద్దు జిల్లాలకు వాహనదారులు పరుగులు పెట్టడంతో ఏపీ-తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది.

ఏపీ ప్రభావం వల్లే..రాష్ట్రంలో డిమాండ్‌

  • ఇది తాత్కాలిక ఒత్తిడే..

  • ఇంధన కొరత లేదు

  • మంత్రి ఉత్తమ్‌ వెల్లడి

  • ఇంధనాన్ని దాచిపెట్టినా, వదంతులు సృష్టించినా చర్యలు: స్టీఫెన్‌ రవీంద్ర

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని పెట్రోల్‌ బంకుల్లో నిల్వలు అడుగంటడం, సరిహద్దు జిల్లాలకు వాహనదారులు పరుగులు పెట్టడంతో ఏపీ-తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. తొలుత ఖమ్మం, నిర్మల్‌ వంటి సరిహద్దు జిల్లాల్లో ఈ సమస్య కనిపించింది. క్రమేపీ అది రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. దీనికితోడు ధరలు పెరుగుతాయన్న ప్రచారంతో అవసరం లేకున్నా చాలా మంది పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంధనం కొరత లేదు. ఒక్కసారిగా డిమాండ్‌ పెరగటంతో తాత్కాలిక ఒత్తిడి ఏర్పడింది’’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోషల్‌ మీడియా వదంతులను నమ్మొద్దని సోమవారం ఓ ప్రకటనలో ప్రజలను కోరారు. ఒకవైపు రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు, ధాన్యం కొనుగోళ్లు కీలక దశలో ఉండడంతో డీజిల్‌ వినియోగం పెరిగిందని, మరోవైపు పరిశ్రమల(ఐ అండ్‌ సీ) విభాగంలో డీజిల్‌ ధర రూ.150కి చేరిన నేపథ్యంలో వారంతా రిటైల్‌ ఔట్‌లెట్ల వైపు వెళ్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితులే భారీ డిమాండ్‌కు కారణమైనట్లు గుర్తించామని వెల్లడించారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు(ఓఎంసీల)తోనూ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించామని, రిటైల్‌ ఔట్‌లెట్లకు నిరంతరం సరఫరా చేయాలని ఆదేశించామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఇండెంట్లన్నీ సోమవారం సాయంత్రానికి పూర్తి చేయాలని సూచించినట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 1,157 ట్యాంకర్ల ద్వారా 7,443 కిలోలీటర్ల పెట్రోల్‌, 11,081 కిలోలీటర్ల డీజిల్‌ను సరఫరా చేసినట్లు వెల్లడించారు. కాగా, పెట్రోల్‌, డీజిల్‌ సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఆందోళనకు గురై ఎవరూ పెట్రోల్‌ బంకులకు పరుగులు తీయొద్దని విజ్ఞప్తి చేశారు. కావాలని కొరత సృష్టించినా, ఇంధనాన్ని దాచిపెట్టినా, ప్రజలను భయపెట్టేలా వదంతులు సృష్టించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Apr 28 , 2026 | 06:33 AM