గృహావసరాలకు గ్యాస్ కొరతలేదు
ABN , Publish Date - Mar 14 , 2026 | 06:00 AM
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో వంటగ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదు....
వాణిజ్య గ్యాస్‌కే కొరత ఉంది
కొరత సృష్టిస్తే చర్యలు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): ‘‘పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో వంటగ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదు. గృహావసరాలకు ఉపయోగించే గ్యాస్‌కు కొరత లేదు. కేవలం వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్‌కు మాత్రమే కొరత ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు’’ అని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఎవరైనా గ్యాస్ డీలర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌పీజీ సరఫరా విషయంలో ఎలాంటి గందరగోళానికి గురికావొద్దని, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. సీఎస్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఏమాత్రం తేడాగా ప్రవర్తించినా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని పౌరసరఫరాల భవన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 25రోజులకు ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకటి చొప్పున వంటగ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు గ్యాస్ కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందనిపేర్కొన్నారు. కొంత మేరకు గ్యాస్ కొరత ఉందని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు. గ్యాస్ సరఫరా అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం మార్గదర్శకాలు కూడా జారీ చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రానికి 1,740 కిలో లీటర్ల కిరోసిన్ సరఫరా చేస్తామని కేంద్రం చెప్పినట్లు వెల్లడించారు. హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి వచ్చే విజ్ఞప్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు.