రైతుల కన్నీళ్లతో బీజేపీ రాజకీయం: తుమ్మల
ABN , Publish Date - May 26 , 2026 | 04:23 AM
రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ, బీఆర్‌ఎస్లకు లేదని, వారి కన్నీళ్లతో రాజకీయం చేసేందుకే బీజేపీ బస్సుయాత్ర చేస్తోందని మంత్రి తుమ్మల...
ట్రాక్టర్ నడుపుతూ యాతాలకుంట టన్నెల్ పనుల పరిశీలన
ఖమ్మం/సత్తుపల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి) : రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ, బీఆర్‌ఎస్లకు లేదని, వారి కన్నీళ్లతో రాజకీయం చేసేందుకే బీజేపీ బస్సుయాత్ర చేస్తోందని మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతారామ ప్రాజెక్టు పనుల్లో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాలకుంటలో.. రూ.117.35 కోట్లతో పూర్తిచేసిన రెండు కిలోమీటర్ల టన్నెల్ పనులను ఆయన పరిశీలించారు. టన్నెల్‌లో ట్రాక్టర్ నడుపుతూ వెళ్లారు. ఏడాదిలోగా టన్నెల్ పనులు పూర్తిచేయడంపై నిర్మాణ సంస్థ ప్రతినిధులు, అధికారులను ఆయన అభినందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనేక ఆంక్షలు పెడుతోందని లారీల్లో ధాన్యం తరలించేందుకు డీజిల్ అందించడం లేదన్నారు. మరోవైపు.. రాజకీయ ఆకాంక్షతో ఇప్పుడు బస్సుయాత్ర చేపట్టడం సిగ్గుచేటన్నారు. రాబోయే రెండున్నరేళ్లలో జూలూరుపాడు టన్నెల్‌తోపాటు పాలేరు లింక్‌కెనాల్ పూర్తిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు సీతారామ ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.