ఖరీఫ్‌లో 60.6 లక్షల హెక్టార్లకు పంటల విస్తీర్ణం
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:42 AM
రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో మొత్తం పంటల విస్తీర్ణం సుమారు 60.60 లక్షల హెక్టార్లకు చేరుకునే అవకాశముందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
యూరియా నిల్వల కోసం కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలి: మంత్రి తుమ్మల ఆదేశం
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో మొత్తం పంటల విస్తీర్ణం సుమారు 60.60 లక్షల హెక్టార్లకు చేరుకునే అవకాశముందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో ముందస్తు యూరియా నిల్వల కోసం రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు ఢిల్లీలోని కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలి, యూరియా సరఫరాలో ఎలాంటి జాప్యంలేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ను అదేశించారు. ఏప్రిల్, మే నెలల్లోనే యూరియాను కేంద్రం నుంచి తెప్పించి నిల్వ చేస్తే రైతులకు సకాలంలో పంపిణీ చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు. కాగా, కరీంనగర్ జిల్లాలో ప్రతిష్ఠాత్మకమైన మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేయాలని ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న తుమ్మల అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిపై అసెంబ్లీ కమిటీ హాలులో ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో మంత్రులు పొన్నం, అడ్లూరి, జూపల్లి పాల్గొన్నారు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులు, పెండింగ్ పనులు, నిధులు తదితరాలపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. పనుల్లో జాప్యాన్ని నివారించి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.