Share News

నీతి, నిజాయితీతోనే నా రాజకీయం జీవితాంతం ప్రజాసేవ చేస్తా

ABN , Publish Date - May 14 , 2026 | 04:11 AM

భద్రాచలం శ్రీరామచంద్రుడి దయ.. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా. ఎప్పటికీ నీతి నిజాయితీతోనే నా రాజకీయం సాగుతుంది.

నీతి, నిజాయితీతోనే నా రాజకీయం జీవితాంతం ప్రజాసేవ చేస్తా

  • భద్రాద్రి రాముడి దయ..ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకొచ్చా

  • ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదమే నాకు అండ.. దండ

  • ఆత్మీయ అభినందన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, మే 13 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ‘భద్రాచలం శ్రీరామచంద్రుడి దయ.. ఎన్టీఆర్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా. ఎప్పటికీ నీతి నిజాయితీతోనే నా రాజకీయం సాగుతుంది. ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజల ఆశీర్వాదం నాకు అండ దండ. జీవితాంతం రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాసేవ చేస్తా’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టి 40ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఖమ్మంలో పార్టీలకతీతంగా తుమ్మల అభిమానులు, నాయకులు ఆత్మీయ అభినందనసభ నిర్వహించారు. బుధవారం సాయంత్రం ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాల మైదానంలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరగ్గా.. అంతకుముందు హైదరాబాద్‌ నుంచి వచ్చిన తుమ్మలకు ఖమ్మంలో నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతంపలికి ర్యాలీ నిర్వహించారు. సభాస్థలానికి చేరుకునే ముందు ఆయన ఖమ్మం బైపా్‌సరోడ్‌ ఎన్టీఆర్‌ సర్కిల్‌లోని నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం సభకు హాజరైన తుమ్మల తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్యారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితం, మంత్రిగా 40 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. 45 ఏళ్లుగా తనకు ఈఖ్యాతి కల్పించిన ఖమ్మంజిల్లా ప్రజలకు ఆ శ్రీరామచంద్రుడికి, తన ను నడిపించిన నాయకత్వానికి తన కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం చేదోడువాదోడుగా ఉంటానన్నారు. మీరిచ్చిన శక్తిని, అధికారాన్ని సామాన్యులు, శ్రమజీవవులకోసం కష్టజీవులకు, బడుగులు, బలహీనవర్గాలకోసం ఉపయోగిస్తానని తెలిపారు. ఎన్టీఆర్‌ ఇచ్చిన స్ఫూర్తితో, అందరు ముఖ్యమంత్రులు ఇచ్చిన అవకాశంతో ప్రతీ గ్రామానికి, ప్రతీ మండలానికి అభివృద్ధి చేసే అవకాశం లభించిందని, అన్ని రాజకీయపార్టీలు ప్రతీఒక్కరు తమ తుమ్మల అని చెప్పుకొనే స్థాయి కి ఎదగగలిగానని అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే రీతిలో ఆశీర్వదించాలని కోరుకుంటున్నానంటూ తుమ్మల కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2026 | 04:11 AM