Share News

మీరు చేసిన అప్పు రూ.8.50 లక్షల కోట్లు.. మేం మిత్తి కడుతున్నాం!

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:50 AM

‘మీ పదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. మీరు చేసిన రూ.8.50 లక్షల కోట్ల అప్పునకు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం మిత్తి చెల్లిస్తోంది.

మీరు చేసిన అప్పు రూ.8.50 లక్షల కోట్లు.. మేం మిత్తి కడుతున్నాం!

  • మీ పదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నాశనం

  • బీఆర్‌ఎస్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిప్పులు

  • నేడే యాసంగి రైతు భరోసా నిధుల విడుదల

  • నర్మెట్ట నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్‌

సిద్దిపేట, హైదరాబాద్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ‘మీ పదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. మీరు చేసిన రూ.8.50 లక్షల కోట్ల అప్పునకు ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం మిత్తి చెల్లిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం అప్పు తీసుకున్నా కూడా మీరు నాడు చేసిన అప్పులకు చెల్లించడానికే సరిపోతోంది. అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఉండటం లేదు. మీ అవినీతితో రాష్ట్రాన్ని నాశనం చేశారు. రేయింబవళ్ళు పని చేసినా కష్టాలు తీరడం లేదు’ అంటూ ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు నిప్పులు చెరిగారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని నర్మెట్టలో నిర్మించిన ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీని ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి తుమ్మల నాగేశ్వర్‌రావు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, కాళేశ్వరం కూలితే.. దాని కింద బాంబులు పెట్టి కూల్చారని బీఆర్‌ఎస్‌ నాయకులు అర్థరహితంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు.


మంత్రిగా తొలి సంతకం

వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రంలో 5 ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీల నిర్మాణం కోసం సంతకం చేశానని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తెలిపారు. కేవలం 16 నెలల్లోనే నర్మెట్ట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యిందని, ఇది దేశంలోనే రికార్డు అన్నారు. ఫ్యాక్టరీ కోసం 62 ఎకరాల భూమి సేకరించామని, 32 ఎకరాల్లో నిర్మాణమైందని.. రూ.300 కోట్లు ఖర్చు చేశామన్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ అనువుగా ఉంటుందని భావించినట్లు తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగుకు రాష్ట్రంలోని 30 జిల్లాల నుంచి రైతులు ముందుకు వచ్చారని.. హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లో సాగుకు అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. గెల అమ్మిన మూడు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని చెప్పారు. గతంలో రాష్ట్రంలో ఎక్కడ ఆయిల్‌పామ్‌ సాగు చేసినా దానిని అశ్వారావుపేటకి తీసుకెళ్లాల్సి వచ్చేదని, దీనివల్ల రైతులకు రవాణా ఖర్చు ఎక్కువయ్యేదని తుమ్మల గుర్తు చేశారు. ఇకపై ఆ సమస్యలు ఉండవన్నారు. నర్మెట్ట ఫ్యాక్టరీలో ఆయిల్‌ రిఫైనరీ ప్రారంభిస్తున్నామని, ఇక్కడి నుండే నేరుగా విజయ బ్రాండ్‌ ద్వారా లబ్ధిదారులకు ఆయిల్‌ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. మలేషియా కంటే కూడా మన దగ్గర ఎక్కువ పామాయిల్‌ ఉత్పత్తికి అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. ఎన్టీఆర్‌ హయాం నుంచే తాను ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.


70 లక్షల మంది రైతులకు భరోసా నిధులు

యాసంగి రైతు భరోసా నిధుల విడుదలకు సర్వం సిద్ధమైంది. నర్మెట్ట ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం నుంచే రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొదటి విడత కింద.. ఎకరం వరకు ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,590 కోట్లు జమ చేయనున్నారు. 20 రోజుల తర్వాత రెండో విడత కింద రూ.2,650 కోట్లను, ఏప్రిల్‌ నెలాఖరునాటికి మూడో విడత కింద మిగిలిన నిధులను రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. మొత్తంగా రైతు భరోసా కింద యాసంగి సాయం రూ.9 వేల కోట్లను రైతులకు ప్రభుత్వం అందించనుంది.

Updated Date - Mar 22 , 2026 | 04:51 AM