కేంద్రం కొంటున్న పంటలేంటో తెలుసుకోండి
ABN , Publish Date - May 03 , 2026 | 05:21 AM
కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే పంటలేంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత ముఖ్యమంత్రికి బహిరంగ లేఖలు రాయాలి. కనీస మద్దతు ధర...
ఎంఎస్పీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే కాదన్న విషయ జ్ఞానం లేకుండా మాట్లాడడం సరికాదు
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు లేఖ రాసిన తుమ్మల
హైదరాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): ‘కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే పంటలేంటో తెలుసుకోవాలి. ఆ తర్వాత ముఖ్యమంత్రికి బహిరంగ లేఖలు రాయాలి. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదన్న విషయాన్ని గుర్తించి మాట్లాడాలి’ అని కేంద్రమంత్రి బండి సంజయ్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంటల కొనుగోలు అంశంపై సీఎం రేవంత్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో దానికి కౌంటర్‌గా మంత్రి తుమ్మల శనివారం ఆయనకు ఏడు పేజీలతో కూడిన లేఖను రాశారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రతీ గింజకు ప్రధాని మోదీ డబ్బులిస్తున్నారన్న విషయం వినడానికి బాగుందని, తాము కూడా అదే జరగాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. కానీ వాస్తవ పరిస్థితులను పరిశీలించి, కేంద్రం అసలు ఏయే పంటలను, ఎంత ధరకు కొనుగోలు చేస్తుందో తెలుసుకోవాలని సూచించారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారని, కానీ అది రాష్ట్ర ప్రభుత్వం పరిఽధిలోని అంశం కాదన్న విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం సంజయ్ రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. పంటల కొనుగోలులో పొద్దు తిరుగుడు, సోయాబీన్‌పై కేంద్రం పరిమితులను విధించినా.. వాటికి మించి కొనుగోలు చేశామని తెలిపారు. ఇక కేంద్రం అసలే కొనుగోలు చేయని జొన్న, మొక్కజొన్న పంటలను సేకరించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.800 కోట్లతో జొన్నలను, రూ.2వేల కోట్లతో మొక్కజొన్నలను కొనుగోలు చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో పండే ప్రతి పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని, అందుకోసం మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలను కూడా ఢిల్లీ తీసుకెళ్లి కేంద్రాన్ని కోరాలన్నారు. కేంద్రాన్ని ఒప్పించాక తమపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టాలని బండి సంజయ్‌కు తుమ్మల సూచించారు.