గుట్కా, పాన్ మసాలా, డ్రగ్స్ ఖైనీ వాడకంతో ప్రాణహాని తప్పదు
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:09 AM
గుట్కా, పాన్ మసాలా, డ్రగ్స్, ఖైనీ వంటి హానికరమైన వాటిని వాడితే ప్రాణహాని తప్పదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు
10కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): గుట్కా, పాన్ మసాలా, డ్రగ్స్, ఖైనీ వంటి హానికరమైన వాటిని వాడితే ప్రాణహాని తప్పదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అందుకే మాదక ద్రవ్యాల వినియోగం, అమ్మకాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని రాయదుర్గం సత్త్వ నాలెడ్జ్ పార్క్‌లో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నోటి క్యాన్సర్ మారధాన్‌లో పాల్గొన్న ఆయన, 10కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, యువత యోగా, వ్యాయామం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు. సైబరాబాద్ సీపీ రమేశ్ 5కే రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె. దిలీప్ కుమార్ మాట్లాడుతూ.. నోటి క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి ఈ మారధాన్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సాధ్యమవుతుందని, ప్రజలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.