Share News

ఉక్కు సంకల్పాన్ని తెలిపేందుకే హిట్లర్‌ పదాన్ని రేవంత్‌ వాడారు

ABN , Publish Date - Jun 09 , 2026 | 04:45 AM

కబ్జాదారుల నుంచి నీటి వనరులను కాపాడటానికి ఉక్కు సంకల్పం అవసరమని చెప్పేందుకే హిట్లర్‌ అనే పదాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వాడారని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.

ఉక్కు సంకల్పాన్ని తెలిపేందుకే హిట్లర్‌ పదాన్ని రేవంత్‌ వాడారు

  • నాజీ సిద్ధాంతాన్ని పాటిస్తానని చెప్పలేదు

  • మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టీకరణ

హైదరాబాద్‌, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): కబ్జాదారుల నుంచి నీటి వనరులను కాపాడటానికి ఉక్కు సంకల్పం అవసరమని చెప్పేందుకే హిట్లర్‌ అనే పదాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వాడారని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. గతంలో చిరంజీవి హీరోగా హిట్లర్‌ పేరుతో సినిమా వచ్చిందని, కానీ ఆ సినిమా ప్రధాన ఉద్దేశం వేరన్నారు. చేపట్టిన పనిని ఎలాగైనా సాధించేవారిని జనబాహుళ్యంలో హిట్లర్‌ అంటారన్నారు. హైడ్రా విషయంలో ఒక లక్ష్యం, క్రమశిక్షణతో ముందుకెళ్లాలన్న ఉద్దేశంతోనే హిట్లర్‌ అనే పదాన్ని సీఎం రేవంత్‌ వాడారన్నారు. అంతే కానీ హిట్లర్‌ సిద్ధాంతాలను పాటిస్తామని చెప్పారా అంటూ నిలదీశారు. ఈ విషయంలో కేటీఆర్‌ వ్యవహార శైలి తాపీ మేస్త్రీకి తలపోటు వస్తే గోడ కూల్చినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. సోమవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ హైడ్రాతో కబ్జాదారుల గుండెల్లో భయం పుట్టిస్తుంటే ఓర్చుకోలేని కొందరు దొంగ ఏడ్పులు మొదలెట్టారన్నారు. అంబేడ్కర్‌ గురించి కేటీఆర్‌ మాట్లాడటం శతాబ్దపు జోక్‌ అని అభివర్ణించారు. పదేళ్ల పాటు సచివాలయానికే రాని కేసీఆర్‌.. ప్రగతి భవన్‌కూ ఎవరినీ రానివ్వలేదన్నారు. నాజీ హిట్లర్‌ బంకర్‌లాగా ప్రగతి భవన్‌ ఉండేదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌లకు పాల్పడటం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. కేటీఆర్‌ సమానత్వం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. మహాత్మాగాంధీ కూడా దొంగతనాలు, కబ్జాలు జరుగుతుంటే చేతులు కట్టుకుని కూర్చోమని చెప్పలేదన్నారు. ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడుతుంటే.. బీఆర్‌ఎస్‌ నాయకులకు బాధ ఎందుకని ప్రశ్నించారు. తాలిబన్‌ విధానంలో పనిచేస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ.. అందరూ అలాగే పనిచేస్తారనుకుంటోందన్నారు. ‘‘గతంలో ఓ సందర్భంలో తాను కూడా హిట్లర్‌ నేనంటూ కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అంటే ఆయన హిట్లర్‌ సిద్ధాంతాన్ని అమలు పరిచారా?’’ అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు వంద సీట్లు వస్తాయని హరీశ్‌రావు చెపుతున్నారని, గోబెల్స్‌ ప్రచారాలు మానుకోకుంటే పది కూడా రావన్నారు. రైతులకు మేలు, నిర్వహణ సౌలభ్యాల కోసమే రైతు డిస్కం తెస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్తు పథకం యథాతథంగా కొనసాగతుందన్నారు. బొగ్గుగనుల వేలంలో సింగరేణి పాల్గొనకుండా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడంతో కోయగూడెం బ్లాక్‌ 3, సత్తుపల్లి బ్లాక్‌ 3 గనులు సంస్థకు దక్కకుండా పోయాయయన్నారు. కేసీఆర్‌ బంధుమిత్రులు, బీఆర్‌ఎస్‌కు చెందిన కాంట్రాక్టర్లే ఎక్కువ మంది సింగరేణిలో ఉన్నారని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. నైని బొగ్గు గనులపై సింగరేణి పారదర్శకంగా ముందుకుపోతుందన్నారు.

Updated Date - Jun 09 , 2026 | 04:45 AM