కాంగ్రెస్ బలంగా ఉన్న చోట ఓట్ల చోరీ
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:30 AM
కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట ఓట్లను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీ చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు.
సర్‌తో 35శాతం ఓట్లు తొలగించే కుట్ర
బొగ్గు నిల్వలపై విచారణ జరిపిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
గోదావరిఖని, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట ఓట్లను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీ చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ద్వారా 30-35శాతం ఓట్లను నకిలీ ఓట్ల పేరిట తొలగించేందుకు కుట్ర చేస్తున్నదన్నారు. బిహార్, బెంగాల్ రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను తెలంగాణలోనూ ప్రయోగిస్తున్నారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్ల అవగాహన, శిక్షణ కార్యక్రమం రామగుండంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, అనంతరం విలేకరులతో శ్రీధర్‌బాబు మాట్లాడారు. సింగరేణిలో నాలుగు మిలియన్ టన్నుల బొగ్గు నిల్వల తేడా ఉందని, రూ.1600 కోట్ల విలువైన బొగ్గు నిల్వలపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రాజకీయ దురుద్దేశంతోనే సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారన్నారు. సింగరేణిలో ప్రతీ విషయం పారదర్శకంగా ఉంటుందని, ఒక్క బొగ్గు పెళ్ల కూడా చోరీ జరుగలేదని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి బీఆర్‌ఎస్, కిషన్‌రెడ్డి ఆరోపణలపై విచారణ జరిపిస్తామన్నారు. బీఆర్‌ఎస్ ఆరోపణలు చేయగానే కిషన్‌రెడ్డి దానికి వంత పాడడం పరిపాటిగా మారిందని ఆయన విమర్శించారు.