Share News

కమీషన్ల ఐఏఎస్‌ అధికారికి మంత్రి చివాట్లు!

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:09 AM

అదో కీలక శాఖ. ఆ శాఖకు నిత్యం ప్రజలతో సంబంధం ఉంటుంది. అలాంటి శాఖలో కొనుగోళ్ల కార్పొరేషన్‌కు ఓ ఐఏఎస్‌ అధికారి కొన్ని నెలల క్రితం బదిలీపై వచ్చారు.

కమీషన్ల ఐఏఎస్‌ అధికారికి మంత్రి చివాట్లు!

  • సెలవుపై వెళ్లిన సదరు అధికారి

  • ఓ కీలక శాఖకు కొన్ని నెలల క్రితమే బదిలీపై రాక

  • వచ్చిన కొద్ది రోజులకే కమీషన్లు షురూ..

  • బిల్లులు పాస్‌ చేయాలంటే కమీషన్లు సమర్పించుకోవాల్సిందే..

  • సీఎం దృష్టికి తీసుకెళ్లిన సదరు మంత్రి.. అయినా బదిలీ కాని వైనం

  • దీంతో రెచ్చిపోయిన అధికారి.. తాజా సమీక్షలో మంత్రి ఆగ్రహం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): అదో కీలక శాఖ. ఆ శాఖకు నిత్యం ప్రజలతో సంబంధం ఉంటుంది. అలాంటి శాఖలో కొనుగోళ్ల కార్పొరేషన్‌కు ఓ ఐఏఎస్‌ అధికారి కొన్ని నెలల క్రితం బదిలీపై వచ్చారు. వ చ్చీరాగానే తన వసూళ్ల దుకాణం తెరిచారు. బిల్లులు పాస్‌ చేయాలంటే కమీషన్లు ఇచ్చుకోవాల్సిందేనంటూ హుకూం జారీ చేశారు. చేసేదేమీ లేక సరఫరాదారులందరూ కమీషన్లు ముట్టజెప్పడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయం కాస్త సంబంధిత మంత్రికి చేరింది. ఆరా తీస్తే అది నిజమేనని తేలింది. దీనిని సదరు మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. తక్షణమే ఆ అధికారిని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఫలితం లేకుండాపోయింది. పలుమార్లు సదరు మంత్రి చేసిన విజ్ఞప్తులను సర్కారు పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటికే అనేకసార్లు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసిన సర్కారు.. ఆ అధికారిని మాత్రం ముట్టుకోలేదు. దీంతో ఆ అధికారి మరింత రెచ్చిపోయారు. తనపై ఫిర్యాదు చేసినప్పటికీ ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడంతో బరితెగించారు. అందిన కాడికి నొక్కేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రజల వద్దకు పాలన మాదిరిగా ఇంటి వద్దకే సరఫరాదారులను పిలిచి వసూళ్ల పర్వానికి తెరతీశారు. సదరు అధికారి వసూళ్లపై సరఫరాదారులంతా మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో పద్ధతి మార్చుకోవాలని సదరు అధికారిని మంత్రి హెచ్చరించినట్లు సమాచారం. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మంగళవారం ఆ శాఖ సమీక్ష జరిగింది. సదరు అధికారి కూడా ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇతర అధికారుల ముందు మంత్రి గట్టిగా ఆ అధికారికి చివాట్లు పెట్టినట్లు తెలిసింది. ఆయన తీరు వల్ల శాఖ పరువుపోతోందని, మీడియాలో పెద్దయెత్తున కథనాలు వస్తున్నాయని, అయినప్పటికీ మార్పురాకపోవడంతోనే సదరు అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రి చివాట్లతో మనస్థాపానికి గురైన సదరు ఐఏఎస్‌ అధికారి వెంటనే సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ పరిణామం ఆ శాఖలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. మరోవైపు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వ పెద్దలు సదరు అధికారిని మార్చకుండా అంత ప్రేమ చూపడం ఏంటని చర్చించుకుంటున్నారు.

Updated Date - Feb 26 , 2026 | 03:09 AM