Share News

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:09 AM

అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్ల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారంటూ తనపై తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్దని బీఆర్‌ఎస్‌ నాయకులను మంత్రి సీతక్క హెచ్చరించారు.

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది

  • బీఆర్‌ఎస్‌ నాయకులకు మంత్రి సీతక్క హెచ్చరిక

ములుగు, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్ల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారంటూ తనపై తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్దని బీఆర్‌ఎస్‌ నాయకులను మంత్రి సీతక్క హెచ్చరించారు. ప్రజలకు అబద్ధాలు చెబుతూ బీఆర్‌ఎస్‌ పబ్బం గడుపుతోందని విమర్శించారు. ములుగులోని లీలా గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కేంద్రం నిబంధనల ప్రకారం అంగన్‌వాడీలకు రూ.11,800తో కొనుగోలు చేయాల్సి ఉండగా.. మొదటిసారి టెండర్లు పిలిచినప్పుడు రూ.14,000 ధరను కోట్‌ చేయడంతో తిరస్కరించామని తెలిపారు. రెండోసారి టెండర్లు పిలిచినప్పుడు రూ. 11,650కి దాఖలైన టెండర్‌ను ఖరారు చేసినట్టు తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే.. ఒక్కో సెల్‌ఫోన్‌ను రూ.14వేలకు కొన్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే దీనిని నిరూపించాలని సవాల్‌ విసిరారు. నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, కోర్టుకు వెళ్లి బీఆర్‌ఎస్‌ నేతల సంగతి తేలుస్తామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న సోషల్‌ మీడియా ఖాతాలపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు తెలిపారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ పన్నెండున్నరేళ్ల మోదీ పాలనలో పేదలకు లబ్ధి చేకూరలేదని, బీజేపీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు.

Updated Date - Apr 12 , 2026 | 04:09 AM