కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:55 AM
అంగన్‌వాడీలకు సెల్ ఫోన్ల కొనుగోలు విషయమై బీఆర్‌ఎస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో చేస్తున్న దుష్ప్రచారానికి బాధ్యుడిగా పేర్కొంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపించారు.
బీఆర్‌ఎస్ సోషల్‌మీడియా ఖాతాల్లో నాపై దుష్ప్రచారం
ఆ పోస్టులను 48 గంటల్లోగా తొలగించి.. క్షమాపణ చెప్పాలి
లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం: మంత్రి సీతక్క
హైదరాబాద్, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : అంగన్‌వాడీలకు సెల్ ఫోన్ల కొనుగోలు విషయమై బీఆర్‌ఎస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో చేస్తున్న దుష్ప్రచారానికి బాధ్యుడిగా పేర్కొంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపించారు. 48 గంటల్లోగా సోషల్ మీడియా ఖాతాల్లోని సదరు పోస్టులను తొలగించి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయమై ప్రజా భవన్‌లో సోమవారం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ అంగన్‌వాడీలకు ఫోన్ల కొనుగోలు విషయమై వ్యక్తిగతంగా ఎవరైనా ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కానీ అవాస్తవాలను పార్టీ అధికారిక ఖాతాల్లో ప్రచారం చేయడం వల్లే కేసీఆర్‌కు లీగల్ నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. రూ.44కోట్ల టెండర్‌లో రూ.30కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం హాస్యాస్పదమని, తప్పును పది సార్లు చెబితే నిజం కాదని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేటీఆర్‌కు గట్టిగా సమాధానాలు ఇచ్చానన్న కక్షతోనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో ఫోన్ ను రూ.11,650కే కొనుగోలు చేశామని, ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరకు టీజీటీఎస్ ద్వారా కొనుగోలు చేసినట్టు వివరించారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఖాతాల్లోని పోస్టులను తొలగించి, క్షమాపణ చెప్పకుంటే, తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, స్మార్ట్‌ఫోన్ల కుంభకోణంపై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు ఎలా పంపుతారని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు మన్నెక్రిశాంక్, సతీష్ రెడ్డి, దినేష్ చౌదరి ప్రశ్నించారు. స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు కోసం రూ.54కోట్లతో టెండర్ పిలిచారని, 35,310స్మార్ట్ ఫోన్లకు రూ.24కోట్లే ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా, మంత్రి సీతక్కపై బురద జల్లితే సహించబోమని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కేంద్రం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరకే అంగన్‌వాడీల కోసం ఫోన్లు కొనుగోలు చేస్తే, అవినీతి జరిగిందంటూ అభాండాలు మోపడం దురదృష్టకరమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. అసెంబ్లీలో కేటీఆర్ ప్రశ్నలకు సీతక్క గట్టిగా సమాధానం ఇచ్చారన్న అక్కసుతో నిందలు వేస్తున్నారని అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ విమర్శించారు. ఆదివాసీ బిడ్డపై అవినీతి మరకలు అంటించాలని చూస్తే ఊరుకోమని కొట్నక్ తిరుపతి అన్నారు.