ప్రతి వాన నీటి బొట్టును ఒడిసిపట్టాలి
ABN , Publish Date - Jul 28 , 2026 | 06:45 AM
' రాష్ట్రంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేలా.. ప్రతి వాన నీటి బొట్టును ఒడిసి పట్టాలి.. ఇందుకు తెలంగాణలోని ఆడబిడ్డలంతా నడుం బిగించాలని’ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
ఆడబిడ్డలంతా నడుం బిగించాలి: మంత్రి సీతక్క
హైదరాబాద్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ‘ రాష్ట్రంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేలా.. ప్రతి వాన నీటి బొట్టును ఒడిసి పట్టాలి.. ఇందుకు తెలంగాణలోని ఆడబిడ్డలంతా నడుం బిగించాలని’ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్థి, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా నీటి సంరక్షణను ప్రజాఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని ఈ మేరకు ఆమె సోమవారం ఓ వీడియో సందేశం ద్వారా పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో ముందుండి పాల్గొని ప్రతి వాన నీటి బొట్టును ఒడిసిపట్టేందుకు కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోగలమని, రానున్న తరాల కోసం ఇప్పటి నుంచే ప్రతి గ్రామం, ప్రతి కుటుంబం జల సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని కోరారు. మహిళా సంఘాలు గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ నీటి సంరక్షణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడుగుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట నిర్మించాలనే లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలన్నారు. జల సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగిస్తూ, వర్షపు నీటి సంరక్షణకు సహకరించాలని మంత్రి సీతక్క కోరారు.