Share News

పంచాయతీల పనితీరుకు పన్నుల వసూళ్లే కొలమానం కాకూడదు

ABN , Publish Date - Jul 04 , 2026 | 05:56 AM

గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లను ఆధారం చేసుకొని అంచనా వేయడం సరికాదని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు.

పంచాయతీల పనితీరుకు పన్నుల వసూళ్లే కొలమానం కాకూడదు

  • ఆదివాసీ, మారుమూల గ్రామాలకు వెసులుబాటు ఇవ్వాలి

  • స్థానిక అవసరాల కోసం ‘అన్‌టైడ్‌ గ్రాంట్లు’ కొనసాగించాలి

  • ఎన్నికలు జరగని పంచాయతీలకు నిధులు నిలిపివేయకూడదు

  • జాతీయ వర్క్‌షాప్‌లో మంత్రి సీతక్క సూచనలు

న్యూఢిల్లీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లను ఆధారం చేసుకొని అంచనా వేయడం సరికాదని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. గ్రామాల అభివృద్థిని అక్కడి ప్రజల ఆర్థిక స్థితితో ముడిపెట్టడం సమంజసం కాదని చెప్పారు. 16వ ఆర్థిక సంఘం ప్రతిపాదించిన పనితీరు ఆధారిత గ్రాంట్లు, సొంత ఆదాయ వనరుల నిబంధనల్లో ఆదివాసి, గిరిజన, వెనుకబడిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్థిక సంఘం ప్రతిపాదనల విషయమై కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వర్క్‌షా్‌పలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను ఆమె వివరించారు. పనితీరు ఆధారిత గ్రాంట్లను స్వాగతిస్తున్నామని, అయితే ఆదాయ సామర్థ్యం తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాలపై అదనపు పన్నుల భారం మోపవద్దని కోరారు. జనాభా తక్కువగా ఉండే షెడ్యూల్డ్‌ ప్రాంతాల పంచాయతీలకు ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని 62 గ్రామ పంచాయతీలకు కేంద్రం నిధులు నిలిపివేయడం సమంజసం కాదని సీతక్క తెలిపారు. స్థానిక అవసరాల కోసం గ్రామసభలు నిర్ణయాలు తీసుకునేలా ‘అన్‌టైడ్‌ బేసిక్‌ గ్రాంట్లను’ తగిన స్థాయిలో కొనసాగించాలని సూచించారు. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాల్లో కేంద్రం వాటాను పెంచాలని కేంద్ర మహిళా, శిశు అభివృద్థి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని రాష్ట్ర మంత్రి సీతక్క కోరారు. ప్రస్తుతం కేంద్రం కేవలం 20 శాతం మాత్రమే భరిస్తోందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అల్పాహారం, పాలు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని, ఈ పథకానికి కూడా ఆర్థిక సాయం చేయాలని కోరారు.

Updated Date - Jul 04 , 2026 | 05:57 AM