Minister Rajanarsimha: 3 ఆస్పత్రులు, 30 మెడికల్ క్యాంపులు
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:37 AM
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే కోట్లాది మంది భక్తులకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని...
భక్తుల కోసం మేడారం జాతరలో ఏర్పాట్లు
ఏర్పాట్లపై అధికారులతో మంత్రి రాజనర్సింహ సమీక్ష
హైదరాబాద్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే కోట్లాది మంది భక్తులకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని వైద్య శాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. శనివారం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నందున జాతర పరిసరాలలో మరిన్ని మెడికల్ క్యాంపులను ముందస్తుగానే ప్రారంభించాలని అధికారులకు మంత్రి సూచించారు. మేడారం చేరుకునే అన్ని మార్గాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మెరుగైన వైద్యం అవసరమైతే పేషెంట్లను ములుగు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు, వరంగల్ ఎంజీఎంకు తరలించాలని మంత్రి సూచించారు. ఇప్పటికే అమ్మవారి గద్దెల వద్ద, జంపన్న వాగు సమీపంలో, ఆర్టీసీ బస్టాండ్ వద్ద 3 వైద్య శిబిరాలను ప్రారంభించామని అధికారులు మంత్రికి వివరించారు. మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకలతో ప్రధాన ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జంపన్న వాగు, ఇంగ్లిష్ మీడియం స్కూల్ వద్ద 6 పడకలతో రెండు మినీ ఆస్పత్రులను, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు కోసం 42 మార్గ మధ్య(ఎన్‌రూట్) మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే జనవరి 25 నుంచి అన్ని వైద్య శిబిరాలు పూర్తి స్థాయిలో పని చేసేలా ప్రణాళికను రూపొందించామని అధికారులు తెలిపారు.