Share News

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ‘సర్‌’ నోటీసులు

ABN , Publish Date - Aug 29 , 2026 | 05:13 AM

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌)లో భాగంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ‘సర్‌’ నోటీసులు

  • తండ్రి పేరు సత్తయ్యకు బదులు సత్యనారాయణగా నమోదు కావడంపై ఆధారాలు కోరిన ఎన్నికల అధికారులు

  • అవసరమైన ధ్రువపత్రాలు అందజేసిన మంత్రి..

  • ‘సర్‌’ నోటీసుకు మహేశ్‌ గౌడ్‌ కూడా ఆధారాల సమర్పణ

హుస్నాబాద్‌/నిజామాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌)లో భాగంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం హుస్నాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఎల్‌వో రజిత మంత్రికి నోటీసులు అందజేశారు. పొన్నం ప్రభాకర్‌ తండ్రి పేరు సత్తయ్య కాగా.. ఓటరు జాబితాలో సత్యనారాయణగా నమోదు కావడంతో దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మంత్రి వెంటనే స్పందించి.. తన తండ్రి పేరును సక్రమంగా సవరించాలని కోరుతూ అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను పరిశీలించుకుని.. ఏవైనా తప్పులుంటే సంబంధిత అధికారులతో ఆధారాలతో తెలియపర్చి సరిచేసుకోవాలని మంత్రి సూచించారు.


మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కూడా..

సర్‌ ప్రక్రియలో భాగంగా టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌కు కూడా నోటీసులు జారీ కాగా.. ఆయన కూడా స్పందించి అవసరమైన ధ్రువపత్రాలు ఎన్నికల అధికారులకు సమర్పించారు. మహేశ్‌ గౌడ్‌కు నిజామాబాద్‌లోని సిర్నాపల్లి గడి వద్ద పోలింగ్‌ కేంద్రం బూత్‌ నంబర్‌ 168లో ఓటు ఉంది. అయితే ఆయన ఇంటి పేరు బొమ్మ కాగా.. 2002 ఓటర్‌ జాబితాలో కేవలం ‘బీ’ అని మాత్రమే పేర్కొన్నారు. ఇటీవల ఎన్యూమరేషన్‌ ఫారంలో ఆయన ‘బొమ్మ’ అని పూర్తిగా రాయడంతో ఎన్నికల అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే గురువారమే సంబంధిత బీఎల్‌వోకు మహేశ్‌ గౌడ్‌ అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించడంతో ఓటర్‌ జాబితాలో పేరును సవరించినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Aug 29 , 2026 | 05:14 AM